సోనియా గాంధీ బయోపిక్‌లో ప్రపంచ సుందరి.. కానీ పట్టాలెక్కని ప్రాజెక్ట్
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:39 PM
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ విడుదల తరువాత పలు చర్చలు తెరపైకి వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ విడుదల తరువాత పలు చర్చలు తెరపైకి వచ్చాయి. ఈ గ్రంథం ఆధారంగా సోనియా గాంధీ జీవితంపై సినిమా తీస్తామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. అయితే ఆమె జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ఇదివరకే ప్రయత్నాలు జరిగాయన్న విషయం మీకు తెలుసా..? 2003లో సోనియా గాంధీ రాజకీయ జీవితంపై జర్నలిస్టు రషీద్ కిద్వాయ్ ‘సోనియా: ఏ బయోగ్రఫీ‘ అనే పుస్తకం రచించారు. అమెరికాలో స్థిరపడిన భారతీయ దర్శకుడు జగన్మోహన్ ముంద్రా, నిర్మాత సునంద మురళి మనోహర్‌కు ఆ పుస్తకం ఎంతోగానో నచ్చింది. సోనియా అనే పేరుతో సినిమా తీసేందుకు వారు సన్నాహాలు చేశారు. సోనియాగాంధీ పాత్ర కోసం హాలివుడ్ అగ్రతార మోనికా బెలూచిని ఎంచుకున్నారు. దీనికి ఆ కథనాయక అంగీకరించి సంతకం చేశారని అప్పట్లో అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
ఎందుకు తెరకెక్కలేదంటే..
‘సోనియా’ సినిమా ప్రారంభానికి 60 రోజుల ముందు చిత్రబృందానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది. బయోపిక్‌లో వాస్తవాలను వక్రీకరించే అవకాశాలున్నాయని ఆందోళన చెందింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లీగల్ నోటీసులపై దర్శకుడు జగన్మోహన్ స్పందించి, తాను తీయాలనుకుంటున్న కథలో వివాదాస్పద అంశాలు లేవని స్పష్టం చేశారు. సోనియా అంటే తనకు ఎనలేని అభిమానమని వివరించారు. అయితే ఈ చిత్రం గురించి గతంలో మాట్లాడిన మోనికా బెలూచి.. సినిమా స్క్రిప్ట్ నచ్చలేదని తెలిపారు. ‘సోనియా గాంధీ పాత్ర పోషించాలని నన్ను కోరిన విషయం నిజమే. అయితే నాకు ఆ స్క్రిప్ట్ నచ్చలేదు’ అని ఆమె పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
ఇబ్రహీంపట్నంలో దారుణం.. మూడు రోజుల క్రితం కాళ్లు, తాజాగా మనిషి తల లభ్యం
ఎండిపోతున్న పంటలకు సీతారామ ప్రాజెక్టు జలాలు.. తుమ్మల కీలక ఆదేశాలు