కర్ణాటక సర్కార్‌లో కీలక పరిణామం... సీఎం కుర్చీ దిగిన సిద్ధరామయ్య..
ABN , Publish Date - May 28 , 2026 | 04:09 PM
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ఆయన లోక్‌భవన్‌కు వెళ్లి.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
బెంగళూరు, మే 28: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ఆయన లోక్‌భవన్‌కు వెళ్లి.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఆ సమయంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన కార్యదర్శికి లేఖ అందజేశారు సిద్ధరామయ్య. గవర్నర్ బెంగళూరుకు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు లోక్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య.. పార్టీ అధిష్ఠానం సూచనల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ఐక్యత దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఉందని.. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రిగా తనకు సహకరించిన ప్రజలు, పార్టీ నాయకులు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్ధరామయ్య.
తన రాజకీయ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ సిద్ధరామయ్య భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లోకి రావడం యాదృచ్ఛికమని, తమ కుటుంబంలో ఇంతకుముందు ఎవరూ రాజకీయాల్లో లేరని అన్నారు. 2006లో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పార్టీ తనకు ఎన్నో అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా రెండు సార్లు, ప్రతిపక్ష నేతగా రెండు సార్లు పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
తన ప్రభుత్వ పనితీరుపై మాట్లాడిన సిద్ధరామయ్య... ఎన్నికల హామీల్లో ఎక్కువ భాగం అమలు చేశామని పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే ఐదు గ్యారంటీ పథకాలను ప్రారంభించామని తెలిపారు. ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసినప్పటికీ ప్రజల కోసం పని చేయడంలో వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం..
సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లాయి: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్