కేరళంలో ఈడీ బృందంపై దాడి కేసు.. 8 మంది అరెస్టు
ABN , Publish Date - May 28 , 2026 | 03:39 PM
కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాల నేపథ్యంలో అధికారులపై దాడి కేసులో 8 మందిని అరెస్టు చేశామని రాష్ట్ర పోలీస్ చీఫ్ తాజాగా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ రెయిడ్స్ సందర్భంగా అధికారులపై దాడికి యత్నించిన 8 మందిని అరెస్టు చేశామని రాష్ట్ర పోలీస్ చీఫ్ ఎ. చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇతర నిందితులను ఇప్పటికే గుర్తించామని కూడా తెలిపారు. హోం మంత్రి రమేశ్ చెన్నితాలతో సమావేశం అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి ఆదేశించారని అన్నారు. బుధవారం ఈడీ రెయిడ్స్ గురించి తెలియగానే భారీ స్థాయిలో పోలీసులను పంపించామని కూడా పోలీస్ చీఫ్ తెలిపారు. ‘తాము వస్తున్నట్టు ఈడీ అధికారులు ముందుగా మాకు చెప్పలేదు. కానీ ఆపరేషన్ మొదలవగానే మేము భద్రత కోసం సెక్యూరిటీని పంపించాము’ అని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ కేరళ పోలీసులు దాదాపు 300 మందిపై కేసులు పెట్టారు. అనుమతిలేకుండా గుమిగూడటం, ప్రభుత్వ అధికారులపై దాడి, అక్రమ నిర్బంధం, హత్యాయత్నం తదితర అభియోగాలతో కేసులు నమోదు చేశారు. మ్యూజియమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈడీ అధికారులపై నిందితులు కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో ఒక అధికారి చేయికి గాయమైంది. ఈడీ వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిలో కారు డ్రైవర్ కూడా గాయపడ్డారు. పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించిన కేరళ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ పోలీసులను కూడా నిరసనకారులు టార్గెట్ చేశారు. నిరసన కారుల వల్ల దాదాపు రూ.3 లక్షల మేర నష్టం జరిగినట్టు తెలుస్తోంది. సీఎంఆర్ఎల్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లల్లో ఈడీ బుధవారం ఈ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం..
సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లాయి: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్