ఆపరేషన్ సిందూర్‌పైనే అభిప్రాయ భేదాలు.. శశిథరూర్ వెల్లడి
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:49 PM
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశలో తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై తాను క్షమాపణ కోరనని తెలిపారు.
న్యూఢిల్లీ: పార్లమెంటులో పార్టీ నియమావళిని తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు. 'ఆపరేషన్ సిందూర్' (Operation) విషయంలోనే తనకు పార్టీతో అభిప్రాయభేదాలున్నట్టు చెప్పారు. అయితే ఈ విషయంలో తాను క్షమాపణ కోరనని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌ను భారత్ చేపట్టింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎండగట్టేందుకు విదేశాలకు వెళ్లిన కేంద్ర ప్రతినిధి బృందంలో శశిథరూర్ ఉండటం సొంత పార్టీ నుంచి విమర్శలకు దారితీసింది.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశలో తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానికి కట్టుబడి ఉన్నానని, దానిపై తాను క్షమాపణ కోరనని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు ముందు తాను రాసిన ఆర్టికల్‌ను థరూర్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక రచయితగా పహల్గాం గురించి తాను ఆర్టికల్ రాశానని, ఉగ్రదాడులకు తగిన సైనిక స్పందన ఉండాలని అందులో చెప్పానని, అభివృద్ధిపై దృష్టిసారించిన భారత్ దీర్ఘకాల ఘర్షణలకు వెళ్లకుండా ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేయాలని అందులో పేర్కొన్నానని చెప్పారు. తాను ఏదైతో అభిప్రాయపడ్డానో అదేవిధంగా పాక్ ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
పార్టీ అధినాయకత్వంతో థరూర్‌కు విభేదాలున్నాయని, రాహుల్ గాంధీ ఇటీవల కొచ్చి వెళ్లినప్పుడు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, రాష్ట్ర నాయకులు సైతం థరూర్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇటీవల ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ పరిణామాలపై థరూర్ సైతం అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కీలక సమావేశానికి థరూర్ గైర్హాజర్
కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్ర నాయకులతో ఏఐసీసీ అధిష్ఠానం శుక్రవారంనాడు సమావేశమైంది. దీనికి కూడా శశిథరూర్ గైర్హాజరయ్యారు. పార్టీకి థరూర్ అవసరం ఇంకెంతమాత్రం లేదంటూ సందీప్ దీక్షిత్ సహా పలువురు పార్టీ నేతలు దీనిపై వ్యాఖ్యానించారు. శశిథరూర్ గైర్హాజరు వెనుక పార్టీతో విభేదాలే కారణమని ఊహాగానాలు సైతం వెలువడ్డాయి. దీనిపై తాజాగా శశిథరూర్ స్పందించారు. పార్టీ అంతర్గతం వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ డిక్లరేషన్ చేసేందుకు తాను ఇక్కడికి రాలేదని, ఇది లిటరరీ ఫెస్టివల్ అని అన్నారు. పార్టీ నాయకత్వంతోనే ఈ విషయం ప్రస్తావించగలనని, బహిరంగ వేదికలమీద కాదని చెప్పారు. సమవేశంలో పాల్గొనే విషయంలో తన అసక్తతను తెలియజేస్తూ పార్టీకి ముందస్తు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఎంపీ ఇంజినీర్ రషీద్‌కు కస్టడీ పెరోల్
61 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ప్రధాని మోదీ
Read Latest National News