పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఎంపీ ఇంజినీర్ రషీద్‌కు కస్టడీ పెరోల్
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:59 PM
పార్లమెంటు సమావేశాల్లో హాజరయ్యేందుకు తాత్కాలిక బెయిల్ కానీ, కస్టడీ పెరోల్ కానీ ఇవ్వాలని రషీద్ ఇటీవల కోరారు. దీనిపై సమాధానం ఇవ్వాలని ఎన్ఐఏకు గతవారం ప్రత్యేక ఎన్ఐఏ జడ్జి ప్రశాంత్ శర్మ నోటీసులు జారీచేశారు.
న్యూఢిల్లీ: బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ (Engineer Rashid)కు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కస్టడీ పెరోల్ మంజూరైంది. ఉగ్రనిధుల కేసులో నిందితుడైన రషీద్ ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు. జనవరి 28 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయనకు అనుమతిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కస్టడీ పెరోల్ మంజూరు చేసింది.
పార్లమెంటు సమావేశాల్లో హాజరయ్యేందుకు తాత్కాలిక బెయిల్ కానీ, కస్టడీ పెరోల్ కానీ ఇవ్వాలని రషీద్ ఇటీవల కోర్టును కోరారు. దీనిపై సమాధానం ఇవ్వాలని ఎన్ఐఏకు గతవారం ప్రత్యేక ఎన్ఐఏ జడ్జి ప్రశాంత్ శర్మ నోటీసులు జారీచేశారు. కోర్టు తాజా ఆదేశాలపై రషీద్ తరఫు న్యాయవాది నిషిత గుప్తా మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశాలు జరిగే జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకూ అన్ని రోజులూ హాజరయ్యేందుకు కోర్టు అనుమతించిందని చెప్పారు. పార్లమెంటు సెక్యూరిటీతో పాటు పోలీసు సెక్యూరిటీతో ఈ సమావేశాలకు రషీద్ హాజరవుతారని తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రనిధుల కేసుకు సంబంధించి 2019లో రషీద్‌ను అరెస్టు చేశారు. విచారణలో ఉండగానే ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై 2 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కాగా, రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలివిడత జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకూ జరుగుతుంది. తిరిగి మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తుంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారంనాడు పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
61 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ప్రధాని మోదీ
పంజాబ్‌లో ఉగ్రవాద కుట్ర భగ్నం.. భారీఎత్తున ఆయుధాలు స్వాధీనం.
Read Latest National News