Share News

డీఎంకే టైమైపోయింది!

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:24 AM

దక్షిణాదిన ఇంతవరకు బీజేపీని ఆదరించని తమిళనాడు, కేరళల్లో ప్రధాని మోదీ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు

డీఎంకే టైమైపోయింది!
PM Md

  • ఇక తమిళనాడు ఎన్‌డీఏతోనే: మోదీ.. తమిళనాడు, కేరళలో ప్రచారానికి ప్రధాని శ్రీకారం

చెన్నై-ఆంధ్రజ్యోతి/తిరువనంతపురం, జనవరి 23: దక్షిణాదిన ఇంతవరకు బీజేపీని ఆదరించని తమిళనాడు, కేరళల్లో ప్రధాని మోదీ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పాలక పార్టీలు/కూటములపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా తమిళనాడులో డీఎంకే టైమైపోయిందన్నారు. అవినీతి డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించేశారని తెలిపారు. ఇక తమిళనాడు ఎన్‌డీఏతోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. చెన్నై సమీపంలోని మదురాంతకంలో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘డీఎంకే ప్రభుత్వ నిష్క్రమణకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇది అవినీతి, మాఫియా, నేరాల (కరప్షన్‌-మాఫియా-క్రైం(సీఎంసీ) సర్కారు. అది ఒక కుటుంబాన్ని మాత్రమే సేవిస్తోంది. ఈ పార్టీలో ఎదగాలంటే.. వారసత్వం, అవినీతి, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, భారత సంస్కృతిని తూలనాడడం.. ఇవే మార్గాలు’ అని ధ్వజమెత్తారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంతో చేసిందని ప్రధాని అన్నారు. 2014కి ముందు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్‌, డీఎంకే భాగస్వాములుగా ఉన్నప్పుడు విడుదలైన నిధుల కంటే 3 రెట్ల నిధులను తన ప్రభుత్వం తమిళనాడుకు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతోందో, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి చేరుతోందో చిన్నపిల్లలకు కూడా తెలుసన్నారు. స్టాలిన్‌ జమానాలో డ్రగ్స్‌, మద్యం మాఫియా మాత్రమే పురోగతి సాధించాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మిత్రపక్షం అన్నాడీఎంకే అధినాయకురాలు, దివంగత మాజీ సీఎం జయలలితను ప్రశంసించారు. ఆమె హయాంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉండేవని.. మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేదని తెలిపారు. మదురైలో తిరుప్పన్‌కుండ్రం కొండపై దీపోత్సవానికి సంబంధించిన వివాదాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. భక్తులకు బీజేపీ మద్దతుగా నిలువగా.. డీఎంకే మాత్రం ఓటుబ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చిందని విమర్శించారు. ఈ సభలో అన్నాడీఎంకే అధినేత పళనిసామి, ఏఎంఎంకే చీఫ్‌ టీటీవీ దినకరన్‌, పీఎంకే అధినేత అన్బుమణి రామ్‌దాస్‌ తదితర మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు.


‘ముస్లింలీగ్‌ మావోయిస్టు కాంగ్రెస్‌’!

మొదట కేరళ వెళ్లిన మోదీ.. తిరువనంతపురం పుత్తారికందం మైదానంలో జరిగిన సభలో ప్రసంగించారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ కూటములపై విరుచుకుపడ్డారు. కాంగ్రె్‌సకు అభివృద్ధి ఎజెండాయే లేదన్నారు. ఆ పార్టీ మావోయిస్టులను మించిన కమ్యూనిస్టుగా.. ముస్లింలీగ్‌ కంటే ఎక్కువ మతతత్వవాదిగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ‘ముస్లింలీగ్‌ మావోయిస్టు కాంగ్రెస్‌ (ఎంఎంసీ)’గా తయారైందన్నారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కేరళ భవిష్యత్‌ను నిర్ణయించనున్నాయి. ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ రెండు కూటములూ అవినీతి, దుష్పరిపాలనలో కూరుకుపోయాయి. బుజ్జగింపు రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేశాయి’ అని ధ్వజమెత్తారు. ఎన్‌డీఏ రూపంలో ప్రజలకు మూడో ప్రత్యామ్నాయం ఉందన్నారు. తిరువనంతపురంలో 25 వేల మందితో జరిగిన ఈ సభలో.. ఓ చిన్నబాలుడు మోదీ చిత్రాన్ని పట్టుకుని నిలబడ్డాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. పలు సందర్భాల్లో ప్రజలు తనపై వివిధ రూపాల్లో తమ ప్రేమను ప్రదర్శిస్తుంటారని.. కానీ విపక్షాలు దానిని డ్రామాగా, ముందస్తు పథకంగా ఆరోపిస్తుంటాయని ఆక్షేపించారు.


చర్లపల్లి సహా 3 అమృత్‌ భారత్‌ రైళ్లకు పచ్చజెండా

తిరువనంతపురంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించే ముందు ప్రధాని 3 అమృత్‌ భారత్‌ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వీటిలో తిరువనంతపురం-చర్లపల్లి, తిరువనంతపురం-తాంబరం, నాగర్‌కోయిల్‌-మంగళూరు రైళ్లతో పాటు త్రిసూర్‌-గురువాయూర్‌ ప్యాసింజర్‌ కూడా ఉన్నాయి. అలాగే పీఎం స్వానిధి క్రెడిట్‌ కార్డును కూడా ప్రారంభించి.. లక్ష మంది లబ్ధిదారులకు పీఎం స్వానిధి రుణాలను పంపిణీ చేశారు. ఈ క్రెడిట్‌ కార్డు ఐదేళ్ల కాలానికి ఉంటుంది. రూ.30 వేల వరకు రుణపరిమితి ఉంటుంది. ఓపెనింగ్‌ లిమిట్‌ రూ.10 వేలే. కార్డు వాడకాన్ని బట్టి క్రమేపీ పెంచుతూ పోతారు. దీనిని యూపీఐ ఐడీకి కూడా లింకు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, సీఎం పినరయి విజయన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌, డిప్యూటీ మేయర్‌ ఆషానాథ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తాంపనూర్‌ ఓవర్‌ బ్రిడ్జి నుంచి పుత్తారికందం మైదానం వరకు ఆయన రోడ్‌షో నిర్వహించారు. దారిపొడవునా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ‘వికసిత కేరళం’ ప్లకార్డులను ప్రదర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మీ ఇంటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉందా?

మోదీపై స్టాలిన్‌, విజయన్‌ ఆగ్రహం

Updated Date - Jan 24 , 2026 | 06:47 AM