మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా?
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:21 AM
ఇంట్లో ఎంత మంది ఉన్నారు? అంటూ ఎప్పుడూ అడిగే ప్రశ్నతో పాటు ఈ సారి జనాభా లెక్కల కోసం వచ్చే అధికారులు.. ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి...
కంప్యూటర్లు ఉన్నాయా.. ఎక్కువగా ఏం తింటారు?
జనగణనలో ఇళ్ల లెక్క కోసం ప్రశ్నావళి సిద్ధం
ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం
న్యూఢిల్లీ, హైదరాబాద్, అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఎంత మంది ఉన్నారు? అంటూ ఎప్పుడూ అడిగే ప్రశ్నతో పాటు ఈ సారి జనాభా లెక్కల కోసం వచ్చే అధికారులు.. ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి? ల్యాప్‌టాప్, కంప్యూటర్లు ఉన్నాయా? అన్న ప్రశ్నలు కూడా అడుగుతారు. మారిన జీవనశైలికి అనుగుణంగా కేంద్రం జనాభా లెక్కల ప్రశ్నలను కూడా మార్చేసింది. 2021లో కరోనా కారణంగా వాయిదా పడిన జనగణన ప్రక్రియ దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభమవుతుంది. జనాభా లెక్కల ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తారు. జనాభా లెక్కల సిబ్బంది లేదా ఎన్యుమరేటర్లు లేదా సర్వేయర్లు తొలుత ఇళ్ల జాబితాను సేకరిస్తారు. అంటే ఓ ప్రాంతంలో ఉన్న ఇళ్లు, భవనాలను గుర్తించి వాటికి ఓ క్రమసంఖ్య ఇస్తారు. దీంతో ఓ ప్రాంతంలో ఉన్న ఇళ్లపై అధికారులకు కచ్చితమైన అవగాహన వస్తుంది. ఇళ్ల జాబితా సేకరణ పూర్తయిన తర్వాత రెండో దశలో ప్రతీ ఇంటిలో జనాభాను లెక్కిస్తారు. 2027 జనాభా లెక్కలకు సంబంధించి ఇళ్ల జాబితా సేకరణ ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30వరకు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామని కేంద్రం కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఇళ్ల జాబితా సేకరణలో భాగంగా సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి 33 ప్రశ్నలకు సమాధానాలు సేకరిస్తారు. ఇళ్ల జాబితాకు సంబంధించిన వివరాలను ప్రజలు ఆన్‌లైన్‌లో సొంతంగా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఏప్రిల్ 1 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుండగా దానికి 15 రోజుల ముందే సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఇక, లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను విభజించాలని కేంద్రం యోచిస్తోంది. జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ, జనాభా లెక్కల ప్రశ్నావళిలో ప్రతి ఒక్కరి కులం కచ్చితంగా తెలుసుకునేలా ప్రశ్నల్లేవు.