61 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:16 PM
దేశవ్యాప్తంగా ఇవాళ జరిగిన 18వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 61,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. మొత్తం నియామకాల్లో 49,200 మంది హోం మంత్రిత్వ శాఖ, పారామిలిటరీ దళాల్లో ఉద్యోగాలు సాధించారు.
న్యూఢిల్లీ, జనవరి 24: దేశవ్యాప్తంగా ఇవాళ(శనివారం) జరిగిన 18వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 61,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. కొత్తగా వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వారికి నియామక పత్రాలను మోదీ వర్చువల్‌గా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 45 కేంద్రాల నుంచి నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మొత్తం నియామకాల్లో 49,200.. హోంమంత్రిత్వ శాఖ, పారామిలిటరీ దళాలకు సంబంధించినవని తెలిపారు. మహిళా కానిస్టేబుల్స్ భారీగా నియమితులవుతున్నారని, గత 11 సంవత్సరాల్లో ప్రభుత్వం అనేక సౌలభ్య చర్యలు తీసుకున్నందు వల్ల ఇది సాధ్యమైందని వివరించారు.
బీఎస్‌ఎఫ్ మహిళా దళాలు సరిహద్దుల్లో జీరో లైన్ వద్ద ఉద్యోగాలు చేస్తున్నాయని, రిపబ్లిక్ డే పరేడ్‌లో సీఆర్‌పీఎఫ్ పురుష దళానికి మహిళా అసిస్టెంట్ కమాండెంట్ నాయకత్వం వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. రోజ్‌గార్ మేళా కార్యక్రమం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ నిబద్ధతను చాటి చెబుతోందని మోదీ పేర్కొన్నారు.
ఈ మేళాల ద్వారా ఇప్పటివరకూ 11 లక్షలకు పైగా నియామక పత్రాలు విడుదల చేశారు. వివిధ మంత్రిత్వ శాఖలు.. హోం వ్యవహారాలు, ఆరోగ్యం, ఆర్థిక సేవలు, ఉన్నత విద్య విభాగాలతోపాటు ఇతర శాఖల్లో ఈ నియామకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ నియామక పత్రాలు స్వీకరించారు.
ఇవీ చదవండి:
ఏజెంటిక్ ఏఐలో కొలువులే కొలువులు
మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు..