బీఎంసీ మేయర్ ఎన్నిక వాయిదా.. గ్రూప్ రిజస్ట్రేషన్ గందరగోళం
ABN , Publish Date - Jan 24 , 2026 | 03:03 PM
బీఎంసీ మేయర్ పోస్టును లాటరీ పద్ధతిలో మహిళకు కేటాయించారు. జనవరి 31న ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే, బీజేపీ, శివసేన కార్పొరేటర్లు గ్రూప్ రిజిస్ట్రేషన్లను ఫైనలైజ్ చేయకపోవడంతో మేయర్ ఎన్నికల ప్రక్రియలో అవాంతరం తలెత్తింది.
ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్ ఎన్నికకు చివరి నిమిషంలో అవాంతరం తలెత్తింది. దీంతో జనవరి 31న జరగాల్సిన మేయర్ ఎన్నిక ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా పడింది. బీజేపీ, షిండే సారథ్యంలోని శివసేన గ్రూప్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముంబై మేయర్ పదవి కోసం బీజేపీ, షిండే శివసేన పోటీ పడుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
బీఎంసీ మేయర్ పోస్టును లాటరీ పద్ధతిలో మహిళకు కేటాయించారు. జనవరి 31న ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే, బీజేపీ, శివసేన కార్పొరేటర్లు గ్రూప్ రిజిస్ట్రేషన్లను ఫైనలైజ్ చేయకపోవడంతో మేయర్ ఎన్నికల ప్రక్రియలో అవాంతరం తలెత్తింది. పోటీలో ఉన్న కూటములన్నీ భాగస్వామ్య ఒప్పంద పత్రాలను మున్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో సమర్పించడం తప్పనిసరి. అంతవరకూ ఎన్నికల ప్రక్రియను చేపట్టే వీలుండదు. ఉద్ధవ్ శివసేన-ఎంఎన్ఎస్ కూటమికి చెందిన 65 మంది కార్పొరేటర్లు రిజస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. బీజేపీ-షిండే కూటమి ఇంకా పేపర్ వర్క్ పూర్తి చేయకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారానికి మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఉమ్మడి గ్రూపుగా రెండు పార్టీలు రిజిస్టర్ చేయించుకుంటాయా, వేర్వేరుగా రిజిస్టర్ చేయించుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.
బీఎంసీలో మూడు దశాబ్దాలపాటు సాగిన ఠాక్రేల పట్టుకు ఇటీవల జరిగిన మహారాష్ట్ర పురపోరులో బీజేపీ-షిండే శివసేన గండి కొట్టాయి. 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 కార్పొరేషన్లను మహాయుతి కూటమి దక్కించుకుంది. ప్రధానంగా 227 మంది సభ్యుల బీఎంసీలో మెజారిటీ మార్క్ 114 కాగా, బీజేపీ-శివసేన కూటమి 118 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 89, శివసేన 29 సీట్లు గెలుచుకోగా, శివసేన యూబీటీ-ఎంఎన్‌ఎస్ కూటమి (65+6) 71 సీట్లు సాధించాయి. కాంగ్రెస్ 24 సీట్లు, ఏఐఎంఐఎం 8 సీట్లు దక్కించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
61 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ప్రధాని మోదీ
పంజాబ్‌లో ఉగ్రవాద కుట్ర భగ్నం.. భారీఎత్తున ఆయుధాలు స్వాధీనం.
Read Latest National News