హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బొలెరో లోయలో పడి దారుణం..
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:09 PM
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఛత్రుండ్ వద్ద మస్రుండ్-చంబా రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్: చంబా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఛత్రుండ్ వద్ద మస్రుండ్-చంబా రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
బుధవారం నాడు కుథేడ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కాకదోతలో జరిగిన ముండన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లింది. వేడుకలో పాల్గొన్న అనంతరం అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమైంది. అయితే, ఛత్రుండ్ వద్దకు రాగానే బొలెరో ప్రమాదవశాత్తూ అదుపుతప్పింది. కొండ ప్రాంతం కావడంతో వాహనం లోయలో పడిపోయింది. దీంతో డ్రైవర్‌తో పాటు బాధిత కుటుంబానికి చెందిన మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రమాదం గురించి తమకు ఈరోజు (గురువారం) ఉదయం సమాచారం అందిందని జిల్లా అదనపు ఎస్పీ దినేశ్ శర్మ తెలిపారు. పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని చెప్పారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన పేర్కొన్నారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చంబా ఆస్పత్రికి తరలించినట్లు అదనపు ఎస్పీ దినేశ్ శర్మ తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు కుథేడ్ గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
టీఎంసీకి కోల్‌కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ
భర్త పైశాచికత్వం.. భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీటీవీలు పెట్టి..