Share News

వైసీపీకి ఒక్క ఓటు వేసిన పాపానికి రాష్ట్రం ఐదేళ్లు నాశనమైంది: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Jun 18 , 2026 | 02:39 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి కోసం ఒక తట్ట మట్టి కూడా వేయలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వెలిగొండ లాంటి ప్రాజెక్టు అభివృద్ధిని కూడా అడ్డుకున్నారంటూ ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీకి ఒక్క ఓటు వేసిన పాపానికి రాష్ట్రం ఐదేళ్లు నాశనమైంది: మంత్రి గొట్టిపాటి
AP Minister Gottipati Ravi Kumar

ఒంగోలు, జూన్18: వైసీపీకి ఒక్క ఓటు వేసిన పాపానికి ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లు నాశనమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఇచ్చిన ఐదేళ్లు వైఎస్ జగన్ ఇంట్లో నిద్రపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము చేస్తున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవాలని మాజీ సీఎం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డి పార్టీకే సొంతమన్నారు.


ప్రకాశం జిల్లాలో గురువారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. 'నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇచ్చిన హామీలతోపాటు అభివృద్ధి చేసి చూపించడంతో కూటమిపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. పెన్షన్ల కోసం రూ.33 వేల కోట్ల ఖర్చు పెడుతున్నాం. విద్య కోసం రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం' అని అన్నారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక తట్ట మట్టి కూడా వేయలేదని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. నాడు ఒక్క ప్రాంతంలోనూ రహదారి నిర్మాణం చేపట్టలేదని, వెలిగొండ లాంటి ప్రాజెక్టు అభివృద్ధిని కూడా అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశానంటూ ప్రజలను మోసం చేశారంటూ జగన్‌‌పై గొట్టిపాటి విమర్శలు గుప్పించారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతి నెలా వెలిగొండ ప్రాజెక్టును పరిశీలిస్తున్నారని మంత్రి తెలిపారు. వెలిగొండ ముంపు గ్రామాల ప్రజలకు రూ.900 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. రాబోయే రోజుల్లో కూటమిలోని పార్టీల నేతలు ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమవుతారని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి చెప్పారు.


ఇవి కూడా చదవండి..

అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న కృష్ణా జిల్లా: మంత్రి వాసంశెట్టి సుభాశ్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 04:47 PM