Goa AAP: గోవాలో ఆప్‌కు ఎదురుదెబ్బ.. సీనియర్ నేత అమిత్ పాలేకర్ రాజీనామా
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:51 PM
పదవులో, పొజిషన్ కోసమే తాను రాజకీయాల్లోకి చేరలేదని, జవాబుదారీతనం, అంతర్గత ప్రజాస్వామ్యం, అట్టడుగు వర్గాల వాణిని ప్రతిబింబించే ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని నెలకొల్పుతామనే ఆప్ వాగ్దానంతో రాజకీయాల్లోకి వచ్చానని పాలేకర్ చెప్పారు.
పనజి: గోవా (Goa)లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత అమిత్ పాలేకర్ (Amit Palekar) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన జిల్లా పంచాయత్ (ZPs) ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఆప్ గోవా విభాగం చీఫ్ పదవి నుంచి ఆమిత్ పాలేకర్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా ఇచ్చారు. తన రాజీనామాను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఒక లేఖలో తెలియజేశారు. నిర్ణయాలన్నీ పైనుంచే తీసుకుంటున్నారని, చర్చలు, సంప్రదింపులకు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని ఆ లేఖలో పాలేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందువల్ల వ్యక్తులే కాగ, సంస్థలు కూడా బలహీనమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పదవులో, పొజిషన్ కోసమే తాను రాజకీయాల్లోకి రాలేదని, జవాబుదారీతనం, అంతర్గత ప్రజాస్వామ్యం, అట్టడుగు వర్గాల వాణిని ప్రతిబింబించే ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని నెలకొల్పుతామనే ఆప్ వాగ్దానంతో రాజకీయాల్లోకి వచ్చానని పాలేకర్ చెప్పారు. అయితే సంప్రదింపులకు తావులేని నిర్ణయాలు తీసుకుంటున్నందున తాను పార్టీలో కొనసాగలేనని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో అనేక విషయాలు నేర్చుకునేందుకు అవకాశం ఇచ్చిన ఆప్ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్తకర్తలతో మమేకమవుతూ సంస్థ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేశానని, అయితే చాలా ఆలోచించే పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కోపంతోనో, తొందరపాటుతోనే కాకుండా ఆత్మగౌరవం కోసం, పూర్తి స్పష్టతతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. గోవా ప్రజలు, తన నియోజకవర్గం కోసం పనిచేస్తూనే ఉంటానని చెప్పారు. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒకే సీటుకు పరిమితం
గోవాలో గత డిసెంబర్‌లో జరిగిన జిల్లా పంచాయత్ ఎన్నికల్లో ఆప్ ఘోర ఓటమిని చవిచూసింది. 50 సీట్లలో కేవలం ఒకే సీటు గెలుచుకుంది. 42 సీట్లలో ఆప్ పోటీ చేసింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 29 సీట్లు గెలుచుకోగా, భాగస్వామ్య పార్టీ ఎంజీపీ 3 సీట్లు గెలుచుకుంది. ఆప్ ఘోరమైన ఫలితాల నేపథ్యంలో పాలేకర్‌ను గోవా చీఫ్ పదవి నుంచి పార్టీ అధిష్ఠానం తొలగించి, శ్రీకృష్ణ పరబ్‌కు ఆ పదవి అప్పగించింది. పాలేకర్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే దానిపై ఆప్ వివరణ ఇవ్వలేదు. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికల 2027లో జరగాల్సి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
సముద్ర ప్రతాప్ నౌక జలప్రవేశం.. ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి