Jammu and Kashmir: పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:51 PM
జమ్మూకశ్మీర్‌లోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, పీఓకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని, ఈ విషయం తాను పదేపదే చెబుతూ వచ్చానని బాబ్ బ్లాక్‌మన్ అన్నారు.
జైపూర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)పై బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ (British MP Bob Blackman) కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)తో సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని తాను మూడు దశాబ్దాల క్రితమే చెప్పానని, ఆ పని 1992లో కశ్మీర్ పండిట్ల వలసల కన్నా ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జైపూర్‌లో సోమవారం నాడు జరిగిన హై-టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 1990 మొదట్లో కశ్మీర్ పండిట్లు వలసలు వెళ్తున్నప్పుడే తన వైఖరిని స్పష్టం చేసినట్టు చెప్పారు.
'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 370వ అధికరణను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయడానికి చాలాకాలం ముందే 1992లో నేను ఈ విషయం ప్రస్తావించాను. కశ్మీర్ పండిట్లకు తీవ్రం అన్యాయం జరుగుతోందంటూ యూకేలో ఒక సమావేశం కూడా నిర్వహించాం. మతం, ఇతర కారణాలతో కశ్మీర్ పండిట్లు తమ పూర్వీకుల ఇళ్లు బలవంతంగా వదిలివెళ్లాల్సి రావడాన్ని ఖండించాం' అని బ్లాక్‌మన్ తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, పీఓకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని, ఈ విషయం తాను పదేపదే చెబుతూ వచ్చానని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలనీ తాను అనేకసార్లు సూచించానని చెప్పారు.
పహల్గాం దాడికి ఖండన
పహల్గాం ఉగ్రదాడిని కూడా బ్లాక్‌మన్ ఖండించారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మొరుగపడటంతో అక్కడ శాంతి నెలకొందని తాము భావించినప్పటికీ పహల్గాం దాడితో ఉగ్రసమస్య మళ్లీ వెలుగులోకి వచ్చిందన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ప్రపంచ దేశాలు బాసటగా నిలబడటం ముఖ్యమని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
ఢిల్లీ అల్లర్ల కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి