Yogi meets Modi: మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:54 PM
ఉత్తరప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ జరుగునుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని ఆయన కలుసుకున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఆయన నివాసంలో సోమవారంనాడు కలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ, 2027లో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ఇరువురు చర్చించారు.
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై
ఉత్తరప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై కూడా ఉభయ నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా యోగి ఆదిత్యనాథ్ కలుసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ జరుగునుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉత్తరప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పంకజ్ చౌదరిని ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ, సంస్థాగత మార్పులు అనేవి ప్రస్తుతం పార్టీ ఎజెండాలో ఉన్నాయి. జనవరి 14-15లో మకర సంక్రాతి పర్వదినం పూర్తి కాగానే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. దీంతో పాటు కమిషన్లు, బోర్డులు, కౌన్సిల్స్‌కు కూడా రాజకీయ నియామకాల ప్రక్రియ త్వరలో చేపడతారు.
బీజేపీలో ఆసక్తికర మార్పులు
ఇటీవల కాలంలో బీజేపీలో పలు ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్‌ను ఇటీవల ఎన్నుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరిని ఎన్నుకున్నారు. ఆ పదవికి పంకజ్ చౌదరి ఒక్కరే నామినేషన్ వేశారు. దీనికితోడు పలువురు బీజేపీ బ్రాహ్మణ ఎమ్మెల్యేలు లక్నోలో కొద్దిరోజుల క్రితం పీఎన్ పాథక్ నివాసంలో సమావేశం కావడం ఆసక్తికరమైంది. కమ్మూనిటీ ఫీస్ట్ (సహభోజ్) కోసం 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
త్వరలో క్యాబినెట్ విస్తరణ
కాగా, గత డిసెంబర్ 30న యోగి ఆదిత్యనాథ్ లక్నో నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ఢిల్లీలోని పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 54 మంది మంత్రులున్నారు. గరిష్టంగా 60 మందిని మంత్రివర్గంలో తీసుకోవచ్చు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే చివరి మంత్రివర్గ విస్తరణ కావచ్చని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ అల్లర్ల కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
హసీనాను కూడా పంపేయండి.. బంగ్లాదేశ్ క్రికెటర్‌కు అసదుద్దీన్ ఓవైసీ మద్దతు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి