ఎన్డీయే సీట్ల షేరింగ్ డీల్ పూర్తి... అస్సాం సీఎం హిమంత
ABN , Publish Date - Feb 22 , 2026 | 07:58 PM
అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆదివారంనాడు తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాతో అమిత్‌షాను కలుస్తామని చెప్పారు.
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ (Himanta Biswa Sharma) ఆదివారంనాడు తెలిపారు. బీజేపీ, అసోం గణపరిషత్ (ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్), బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) పార్టీలకు ప్రస్తుత అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉందని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేనప్పటికీ రభా హసోంగ్ జౌత సంగ్రామ్ సమితి (ఆర్‌హెచ్‌జేఎస్‌ఎస్), జనశక్తి పార్టీ (జేపీ)లు ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు.
'ఎన్డీయే కూటమి డీల్ పూర్తయింది. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నామనేది మాకందరికీ తెలుసు. కూటమిలో ఎలాంటి ఇబ్బందులు లేవు' అని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హిమంత బిశ్వా శర్మ చెప్పారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాతో కేంద్ర మంత్రి అమిత్‌షాను రాష్ట్ర నేతలు కలుస్తారని తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా సీట్ల పంపకాల ఒప్పందం ఖరారవుతుందని గత జనవరి 7న ఆయన ప్రకటించారు.
మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు
126 మంది సభ్యుల అస్సాం అసెంబ్లీకి మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2023లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. కాగా, ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ సారథ్యలోని ఎన్డీయేకు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ (9), యూపీపీఎల్ (7), బోడోల్యాండ్ పీపుల్స్ పార్టీ (3)లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. విపక్ష పార్టీలైన కాంగ్రెస్‌కు 26 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు 15 మంది ఎమ్మెల్యేలు, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మరో స్వతంత్ర అభ్యర్థి కూడా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతిభ ఉన్నా ఇతర దేశాలకు సేవ చేసేందుకే పరిమితం.. శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు
నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి టీవీకే చీఫ్ విజయ్ పోటీ