Share News

నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి టీవీకే చీఫ్ విజయ్ పోటీ

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:15 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీవీకే చీఫ్ విజయ్ (Vijay) ఉత్తర చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ కార్యదర్శి ఆధవ్ అర్జున ఆదివారంనాడు తెలిపారు.

నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి టీవీకే చీఫ్ విజయ్ పోటీ
TVK Chief Vijay

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీవీకే చీఫ్ విజయ్ (Vijay) ఉత్తర చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ కార్యదర్శి ఆధవ్ అర్జున ఆదివారంనాడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నలుమూలలా పర్యటించి ప్రజలకు చేరువయ్యేందుకు విజయ్ సన్నాహకాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. నార్త్ చెన్నై వెనుకబాటుకు డీఎంకేనే కారణమని విజయ్ తరచు ఆరోపిస్తున్నారు.


పెరంబూర్ నుంచి పోటీకి తీర్మానం

టీవీకే చీఫ్ విజయ్‌ను పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతూ చెన్నైలో ఆదివారంనాడు జరిగిన టీవీకే కార్యకర్తల సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానాన్ని ఆధవ్ అర్జున ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, కార్యకర్తల అభీష్టాన్ని దళపతి విజయ్ దృష్టికి తీసుకువెళ్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్ తెలిపారు.


మే10వ తేదీకి ముందే ఎన్నికలు

234 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తమిళనాడు అసెంబ్లీకి మే 10వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 151 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది.


డీఎంకేతో డీఎండీకే పొత్తు

ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో పొత్తుల కోసం వేగంగా పావులు కదుపుతున్నాయి. డీఎంకే సారథ్యంలోని కూటమిలో తాజాగా విజయ్‌కాంత్ డీఎండీకే వచ్చి చేరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌లత విజయ్‌కాంత్, కోశాధికారి ఎల్‌కే సుధీష్ గత వారంలో డీఎంకే ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలుసుకున్నారు. డీఎంకేతో పొత్తుకు నిర్ణయించినట్టు సమావేశానంతరం ప్రేమ్‌లత విజయకాంత్ తెలిపారు. ఇరుపార్టీల మధ్య చర్చల తర్వాత సీట్ల పంపకాలు ఖరారవుతాయని చెప్పారు. డీఎంకే కూటమి 200 సీట్లలో గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


మరోవైపు అన్నాడీఎంకే-బీజేపీ కలిసి ఎన్డీయే కూటమిగా ఎన్నికల బరిలో సవాలు విసురుతోంది. ఇదే సమయంలో టీవీకే సైతం ఎన్నికల బరిలోకి దిగడంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది.


ఇవి కూడా చదవండి..

దేశం పరువు తీయొద్దు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు..

నమో భారత్ ట్రైన్, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోదీ

Updated Date - Feb 22 , 2026 | 05:17 PM