ఏఐ సమ్మిట్ ఓ కీలక మలుపు! మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:40 PM
మన్ కీ బాత్ 131వ ఎడిషన్ కార్యక్రమంలో ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఏఐ సమ్మిట్‌ను దేశ సాంకేతిక అభివృద్ధిలో ఓ మేలి మలుపని వ్యాఖ్యానించారు. భారత్‌లో సృజనాత్మకత చూసి ప్రపంచం అచ్చెరవొందుతోందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఏఐ సమ్మిట్ సహా పలు కీలక అంశాల గురించి తన మనసులో భావాలను తాజా 131వ ఎడిషన్ కార్యక్రమంలో ప్రజలతో పంచుకున్నారు.
ఇటీవలే జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సుతో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత సాంకేతిక రంగ అభివృద్ధిలో ఈ సదస్సు ఓ మేలి మలుపు అని అన్నారు. ఈ సదస్సులో తాను ప్రపంచస్థాయి టెక్ లీడర్స్, సీఈఓలను కలుసుకున్నట్టు తెలిపారు. భారత్‌లో జరుగుతున్న అనేక ఆసక్తికర సాంకేతిక అంశాల గురించి వారికి వివరించానని అన్నారు. పశు పోషణ, వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగిస్తున్నదీ వివరించానని అన్నారు. ఏఐతో రైతులు తమ పశు సంపద, పంటలను నిరంతరం ఓ కంట కనిపెట్టుకుని ఉండగలుగుతున్నారని తెలిపారు.
భారత తయారీదార్లు, స్టార్టప్ సంస్థలు నాణ్యమైన వస్తువుల తయారీపై దృష్టిపెట్టాలని అన్నారు. వంకపెట్టడానికి వీలులేని వస్తుసేవలతో అంతర్జాతీయ స్థాయిలో గౌరవమన్ననలను పొందాలని సూచించారు. సృజనాత్మకతకు కేంద్రంగా దేశాన్ని నిలపాలని తెలిపారు. భారతీయ యువత, ఇన్నోవేటర్స్, వ్యాపారవేత్తలకు ఆ శక్తి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అవయవ దానానికి ముందుకొచ్చే వారిపై కూడా ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఇటీవల మరణించిన కేరళ చిన్నారి ఆలిన్ షేరిన్ అబ్రహామ్‌ను గుర్తు చేశారు. మరణించిన తమ బిడ్డ అవయవాలతో ఇతరులకు ప్రాణదానం చేసినందుకు ఆలిన్ తల్లిదండ్రులను అభినందించారు. 10 నెలల వయసున్న ఆలిన్ ఇటీవల జరిగిన యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలై కన్నుమూసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు ఆమె అవయవదానానికి అంగీకరించడంతో దేశంలోనే అత్యంత పిన్న వయసు అవయవదాతగా ఆలిన్ నిలిచింది.
ఇక వలస సంస్కృతి, చిహ్నాలను వదిలిపెట్టి భారతీయత వైపు మళ్లాలని ప్రధాని మోదీ తన ప్రసంగంలో సూచించారు. గతంలో ఎర్ర కోట వద్ద తను చేసిన ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ ప్రసంగాన్ని గుర్తు చేశారు. బానిస మనస్తత్వాన్ని వీడి ఆలోచనల్లో స్వతంత్రతను సాధించాలని పిలుపునిచ్చారు.
డిజిటల్ అక్షరాస్యత, సైబర్ సెక్యూరిటీ ఆవశ్యకత గురించి కూడా ప్రధాని పేర్కొన్నారు. డిజిటల్ వేదికల వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిజిటల్ అంశాలపై అవగాహన పెరుగుతున్నా ఆన్‌లైన్ మోసాలు ఎక్కువవుతున్న వైనంపై ప్రజలను అప్రమత్తం చేశారు. కేవైసీ నిబంధనలు, ఇతర డిజిటల్ అంశాల గురించి అవగాహన పెంచుకోవాలని అన్నారు.
ఏఐడీఎమ్‌కే దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా ప్రధాని మంత్రి ప్రశంసించారు. ఫిబ్రవరి 24న జయలలిత జయంత్యుత్సవం నేపథ్యంలో ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె తన జీవితాన్ని ప్రజాక్షేమానికి అంకితం చేశారని అన్నారు. తమిళనాడు ప్రజల మనసుల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయారని కీర్తించారు.
ఇవీ చదవండి:
భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు
రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్