Share News

నమో భారత్ ట్రైన్, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోదీ

ABN , Publish Date - Feb 22 , 2026 | 02:51 PM

ఉత్తరప్రదేశ్‌లో నమో భారత్ ట్రైన్ సర్వీస్, మీరట్ మెట్రో ట్రైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి ఈ సర్వీసులను జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు.

నమో భారత్ ట్రైన్, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోదీ
PM Modi inaugurates NaMo Bharat train and Meerut Metro

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నమో భారత్ ట్రైన్ సర్వీస్, మీరట్ మెట్రో ట్రైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి ఈ సర్వీసులను జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. అనంతరం శతాబ్ది నగర్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకూ మీరట్ మెట్రోలో మోదీ, ఆదిత్యనాథ్ కలిసి ప్రయాణించారు.


నూతన విప్లవం

రైలు సర్వీసులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్, అభివృద్ధి భారత్ దిశగా నూతన విప్లవం ఈరోజు ఊపందుకుందని, తొలిసారి ఒకే ఫ్లాట్‌ఫాం నుంచి ఒకేరోజు నమో భారత్ ర్యాపిడ్ రైలు, మెట్రో రైలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పనితీరు తనకెంతో సంతృప్తి నిచ్చిందని, బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం పని సంస్కృతిని ఇవాల్టి కార్యక్రమం ప్రతిబింబిస్తుందని చెప్పారు. శంకుస్థాపన రాయి పడినప్పటి నుంచి రేయుంబవళ్లు పనిచేసి ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ వర్క్ కల్చర్ అని వివరించారు.


మెట్రోలో ప్రయాణం అనంతరం మొహియిద్దీన్‌పూర్‌కు మోదీ వెళ్లారు. అక్కడి బహిరంగసభలో పాల్గొన్నారు. పశ్చిమ యూపీలో మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, ప్రజాపనులకు సంబంధించి రూ.12,930 కోట్ల విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.


నమోభారత్, మీరట్ మెట్రో

ఢిల్లీ-మీరట్‌ను అనుసంధానించే నమో భారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది. ఇది దేశంలోనే తొలి ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్). మీరట్ మెట్రో కూడా ఇదే ట్రాక్‍ మీద ప్రయాణిస్తుంది. ఇండియాలోనే ఫాస్టెస్ట్ మెట్రో సిస్టమ్‌గా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి అరగంటలో గమ్యం చేరుతుంది. ఈ కారిడార్ ఎన్‌సీఆర్‌లోని కీలక నివాస, వాణిజ్య, పారిశ్రామిక హబ్‌లను కలుపుతుంది. సరాయ్ కలే ఖాన్, ఆనంద్ విహార్, ఘజియాబాద్, గుల్దర్, మురదన్‌నగర్, మోదినగర్, మీరట్ సౌత్‌ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది. ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్, చుట్టుపక్కల ప్రాంతాలైన ఫరీదాబాద్, గురుగామ్, నొయిడాలోని లక్షలాది ప్రయాణికులకు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం చేకూరుతుంది. స్టేషన్ల సమీపంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ పెరిగిందని, ఇక్కడి భూముల ధరలు గత రెండేళ్లలో 30 నుంచి 67 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌టీసీ అధికారులు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మీరట్, ఘజియాబాద్, మురద్‌నగర్, మోదీనగర్‌లలో కొత్త రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను ఇప్పటికే బిల్డర్లు ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

ఏఐ సమ్మిట్ ఓ కీలక మలుపు! మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు

Updated Date - Feb 22 , 2026 | 02:52 PM