Share News

సుంకాలు 15 శాతం

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:40 AM

ప్రపంచదేశాలపై విధించిన 10శాతం సుంకాలను 15శాతానికి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం ప్రకటించారు. అదనపు సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును...

సుంకాలు 15 శాతం

సుప్రీం తీర్పు నేపథ్యంలో విధించిన 10 శాతాన్ని మరింత పెంచిన ట్రంప్‌

వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 121 ఇచ్చిన వెసులుబాటు పూర్తిగా వినియోగం

న్యాయ, చట్టపరమైన మార్గాల్లో మరిన్ని టారి్‌ఫలు విధిస్తామని ప్రకటన

వాణిజ్య ఒప్పందంలో 18 శాతంగా ఉన్నా.. భారత్‌పై ప్రస్తుతానికి 15 శాతమే వసూలు

ఇప్పటికే వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి చెల్లించే అంశంలో సందిగ్ధత

  • కొన్ని నెలల్లో ఇంకా పెంచుతామని వెల్లడి

వాషింగ్టన్‌/ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ప్రపంచదేశాలపై విధించిన 10శాతం సుంకాలను 15శాతానికి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం ప్రకటించారు. అదనపు సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతేకాదు వివిధ న్యాయ, చట్టబద్ధమైన మార్గాల్లో మరిన్ని సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్‌ అడ్డగోలు అదనపు సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేయడంతో.. అంతకుముందటి పాత సుంకాలు తిరిగి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌.. వెంటనే పాత యాంటీ డంపింగ్‌, కౌంటర్‌ వెయిలింగ్‌, జాతీయ భద్రత సుంకాలను 10శాతానికి పెంచారు. మరునాడే దీనిని 15శాతానికి పెంచుతున్నట్టు ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన అమెరికా వ్యతిరేక, హాస్యాస్పదమైన తీర్పును క్షుణ్నంగా, లోతుగా సమీక్షించి ఒక నిర్ణయం తీసుకున్నాను. దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటూ వస్తున్న(నేను అధ్యక్షుడిని అయ్యే వరకు) ప్రపంచ దేశాలపై నిన్న వేసిన 10ు టారి్‌ఫను 15శాతానికి పెంచుతున్నాను. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. కొన్ని నెలల్లో న్యాయ, చట్టపరమైన మరిన్ని కొత్త టారి్‌ఫలను మా ప్రభుత్వం అమల్లోకి తెస్తుంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.


వెసులుబాటును పూర్తిగా వాడుకుంటూ..

అమెరికా వాణిజ్య చట్టం-1974లోని సెక్షన్‌ 122 ప్రకారం ఆ దేశ అధ్యక్షుడికి ప్రపంచంలోని ఏ దేశంపై అయినా గరిష్ఠంగా 15శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారం ఉంది. ట్రంప్‌ శుక్రవారం ఈ చట్టం ప్రకారమే 10శాతం సుంకాలు వేశారు. శనివారం వెసులుబాటును పూర్తిగా వినియోగించుకుంటూ 15శాతానికి పెంచారు. ఇక ఇదే చట్టంలోని 201, 301 సెక్షన్లు, టారి్‌ఫల చట్టంలోని 338వ సెక్షన్‌, వాణిజ్య విస్తరణ చట్టం-1962లోని సెక్షన్‌ 232 కింద కూడా సుంకాలు విధించేందుకు అవకాశం ఉంది. అయితే అవి అధ్యక్షుడి విచక్షణాధికారం మేరకు గంపగుత్తగా వేయడానికి వీల్లేదు. ఒక అధ్యయనం చేయించి.. నిర్ణీత ఉత్పత్తులతో దేశంలో వ్యాపారాలు, పరిశ్రమలకు ఇబ్బంది అని తేల్చి.. అందుకు అనుగుణంగా సుంకాలు వేయవచ్చు. ఇందుకోసం కొంత సమయం పడుతుంది. మరికొన్ని నెలల్లో కొత్తగా సుంకాలు వేస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన.. ఈ చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం అధ్యయనాలు, చర్యలు చేపట్టేందుకేనని అమెరికా వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా 15 శాతమే..

భారత్‌ సహా మొత్తం ప్రపంచ దేశాల దిగుమతులపై అమెరికా సుంకాలు 15శాతంగా ఉండనున్నాయి. భారత్‌ సహా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న/సిద్ధమైన దేశాలన్నింటికీ కూడా ప్రస్తుతానికి ఇదే వర్తించనుంది. సదరు ఒప్పందంలో టారిఫ్‌ శాతం ఎంత ఉన్నా కూడా ప్రస్తుతం తాత్కాలికంగా 15ు సుంకాలకు మారుతాయని వైట్‌హౌజ్‌ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు భారత వస్త్రాలపై పాత సుంకాలు 7-9 శాతం వరకు ఉండగా ఇప్పుడు 15శాతంగా ఉంటాయి. అయితే ఉక్కు, అల్యూమినియంపై ఉన్న 50ు, పలు రకాల వాహన విడిభాగాలపై ఉన్న 25 ప్రత్యేక టారి్‌ఫలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయి. కాగా, అదనపు సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసినా 2026లో తాము అంచనా వేసుకున్న మేరకు టారి్‌ఫల ఆదాయం సమకూరుతుందని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెసెంట్‌ పేర్కొన్నారు. వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 122 కింద విధించిన 15శాతం సుంకంతోపాటు 232, 301 సెక్షన్ల కింద విధించబోయే సుంకాలు దీనికి దోహదం చేస్తాయని వెల్లడించారు.


టారిఫ్‌లపై పరిణామాలను పరిశీలిస్తున్నాం: భారత ప్రభుత్వం

అదనపు సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు, తదనంతరం జరిగిన పరిణామాలపై అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘‘అదనపు సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు, తర్వాత దానిపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందనను గమనించాం. ఈ అంశంలో అమెరికా ప్రభుత్వం పలు చర్యలను కూడా చేపట్టింది. ఈ అంశాలను, వాటితో నెలకొనే పరిణామాలపై అధ్యయనం చేస్తున్నాం’’ అని పేర్కొంది. వాణిజ్య ఒప్పందం గురించిగానీ, భారత్‌పై ప్రభావాల గురించిగానీ ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 06:40 AM