ప్రతిభ ఉన్నా ఇతర దేశాలకు సేవ చేసేందుకే పరిమితం.. శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:23 PM
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా (Sam Pitraoda) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారత నైపుణ్యాలు దోహద పడుతున్నాయని అన్నారు.
న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా (Sam Pitraoda) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారత నైపుణ్యాలు దోహద పడుతున్నాయని అన్నారు. ఇండియన్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌పై ఆయన మాట్లాడుతూ, 150 కోట్ల జనాభా ఉన్న దేశానికి సొంతంగా ఆపరేటింగ్ సిస్టం లేకపోవడం సిగ్గుచేటని 'యూట్యూబ్ ఛానెల్'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
'మనకు యువ టాలెంట్ ఎంతో ఉంది. అయితే వారి ప్రతిభను ఉపయోగించుకోవడంలో భారత్ విపలమవుతోంది. అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి సంస్థలు ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, లీగల్ సిస్టమ్, పరిశ్రమలు, ఉత్పత్తిరంగం, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో మన యువతలోని నైపుణ్యాలను వాడుకుంటున్నాయి. గ్లోబల్-స్కేల్ టెక్నాలజీ ఉత్పత్తులను భారత్ సొంతంగా తయారీచేయలేకపోతోంది. మన టాలెంట్ ఇతర దేశాలకు సేవ చేసేందుకే ఉపయోగపడుతోంది' అని శామ్ పిట్రోడా విమర్శించారు.
అబద్ధాలతో భారత్‌ను ఎగతాళి చేస్తున్నారు: బీజేపీ
శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. 'లష్కరే కాంగ్రెస్' చీప్ అడ్వయిజర్ మరోసారి తన అబద్ధాలతో భారత్‌ను ఎగతాళి చేస్తున్నారని విమర్శించింది. 'షర్ట్‌లెస్ (చొక్కాలు లేకుండా) నిరసనల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లష్కరే కాంగ్రెస్ చీఫ్ అడ్వయిజర్ శామ్ పిట్రోడాను దింపింది. భారత్‌పై విరుచుకుపడటమే ఆ పార్టీ ఎజెండా. అంకుల్ శామ్ అబద్ధాలతో భారత్‌ను ఎగతాళి చేస్తున్నారు. మొబైల్స్‌కు ఓఎస్‌లను కూడా తయారుచేయలేదంటూ భారత్‌ను అవమానిస్తున్నారు' అని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. బాస్ లినక్స్, మాయ ఓఎస్, ప్రైమ్ ఓఎస్, భార్ఓఎస్, ఇండస్ ఓస్, నెక్స్ట్ క్వాంటమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను భారత్ అభివృద్ధి చేసిన విషయం ఆయనకు తెలిసినట్టు లేదని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
దేశం పరువు తీయొద్దు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు..
ఏఐ సమ్మిట్ ఓ కీలక మలుపు! మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ