భారత్ ఎదిగితే వారి దుకాణాలు మూతపడతాయి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:58 PM
ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి బలమైన దేశాలు ప్రయత్నిస్తుంటాయన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) తెలిపారు. తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి బలమైన దేశాలు ప్రయత్నిస్తుంటాయని, భారత్ మాత్రం తమను ద్వేషించే వారికీ సహాయం చేస్తుందన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఏర్పాటు చేసిన ఐదవ పద్మా ఉత్సవంలో భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ..'ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్ అభివృద్ధిని కోరుకోవడం లేదు. ఆయా దేశాలు ‘బలవంతుడిదే పైచేయి’ అనే సూత్రాన్ని బలంగా నమ్ముతాయి. అందుకే ఇతరులను ఎప్పుడూ ఒత్తిడిలో ఉంచడానికి ప్రయత్నిస్తాయి. మనం అభివృద్ధి చెందితే వారి దుకాణాలు మూతపడతాయి. అందుకే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటాయి. కానీ, భారత్ మాత్రం మనల్ని ద్వేషించే పొరుగు దేశాలకు కూడా సహాయం చేస్తుంది. మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌తో పాటు పాకిస్థాన్‌కు కూడా కష్టాల్లో భారత్ సహాయం చేసింది’ అని మోహన్ భాగవత్ గుర్తుచేశారు.
బానిసత్వ సంకెళ్ల నుంచి నేటి దేశ యువత విముక్తి పొందిందని భాగవత్ అభిప్రాయపడ్డారు. నేటి తరం అబద్ధాలను ద్వేషిస్తుందని, ఎవరైనా నిజాయతీగా మాట్లాడితే వారికి మద్దతుగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. తమ దేశాన్ని అత్యంత గొప్ప స్థానంలో చూడాలని నేటి యువత కోరుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగిస్తూ.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో యువతదే కీలక పాత్ర అని, అభివృద్ధి ఫలాలు కూడా వారికే చెందుతాయన్నారు. జ్ఞానజ్ఞ ఫౌండేషన్ అనే సంస్థ పద్మ ఉత్సవాన్ని నిర్వహించింది. వివిధ రంగాలకు చెందిన పద్మ పురస్కార గ్రహీతలను ప్రజలతో మమేకమయ్యేలా చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
పుణెలో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం!
కాంగ్రెస్-ఎస్పీ పొత్తు.. అమేథీ, రాయ్‌బరేలీతో అసలు సమస్య..