Share News

టీఎంసీని వీడాలని ప్రణబ్ ముఖర్జీనే చెప్పారు.. సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:16 PM

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి బీజేపీలో చేరాలని దివంగత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ తనకు సూచించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు.

టీఎంసీని వీడాలని ప్రణబ్ ముఖర్జీనే చెప్పారు.. సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు..
Suvendu Adhikari

ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి బీజేపీలో చేరాలని దివంగత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ తనకు సూచించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. టీఎంసీలోనే కొనసాగితే ఓ ఉద్యోగిలా మిగిలిపోతావని, సొంతంగా ఎదగాలనుకుంటే నరేంద్ర మోదీతో కలిసి ముందుకు సాగాలని ప్రణబ్ ముఖర్జీ తనకు సూచించినట్లు తెలిపారు. కోల్‌కతాలో తాజాగా జరిగిన 'ది ఎకనామిక్ టైమ్స్ బెంగాల్ అసెండ్స్' కార్యక్రమంలో సువేందు అధికారి ఈ విషయాలను వెల్లడించారు (Suvendu Adhikari about Pranab Mukherjee).


'ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో నేను ఆయనను కలిశాను. ఆ సందర్భంగా ప్రణబ్ నాకు కొన్ని కీలక సూచనలు చేశారు. టీఎంసీలోనే కొనసాగితే ఓ ఉద్యోగిలా ఉండిపోతావని, రాజకీయంగా సొంత గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటే మోదీతో కలిసి ముందుకు వెళ్లాలని నాకు చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ నాకు ఒక మార్గదర్శకుడు. ఆయన సలహాను నేను పాటించాను. ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు మన మధ్య లేరు. ఈ అంశంపై మరిన్ని వివరాలు చెబితే వివాదం తలెత్తే అవకాశం ఉంది' అని సువేందు పేర్కొన్నారు (Pranab Mukherjee Advice).


టీఎంసీ పనితీరుపై ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను కూడా సువేందు అధికారి గుర్తుచేసుకున్నారు (Suvendu Adhikari BJP). టీఎంసీని మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిపత్యంలో నడిచే సంస్థగా ప్రణబ్ అభివర్ణించినట్లు తెలిపారు. వాళ్లిద్దరూ కలిసి పార్టీని ఒక ప్రైవేటు కంపెనీ తరహాలో నడుపుతున్నారని ప్రణబ్ చెప్పినట్లు సువేందు వివరించారు. ప్రణబ్ మాటల్లోని విషయాన్ని అర్థం చేసుకుని టీఎంసీ నుంచి బయటకు వచ్చానని సువేందు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..


తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 25 , 2026 | 05:32 PM