తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:49 PM
తమిళనాడులోని మదురైలో ఉన్న తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం వెనుక వందేళ్లకు పైగా చరిత్ర ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని మదురైలో ఉన్న తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొండపై ఉన్న పురాతన రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలా? లేక ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలోని సాంప్రదాయ మండపం వద్దే వెలిగించాలా? అనే వివాదం వెనుక వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. మద్రాస్ హైకోర్టు తీర్పులో నమోదైన వివరాల ప్రకారం, 1862లోనే కొండపై దీపం వెలిగించేందుకు ప్రయత్నాలు జరిగాయి. 1912లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది (Thiruparankundram Deepam Row).
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై సుబ్రమణ్యస్వామి ఆలయంతో పాటు సికందర్ బాదుషా దర్గా కూడా ఉంది. కొండపై ఉన్న ఒక పురాతన రాతి స్తంభాన్ని హిందూ భక్తులు దీపస్తంభంగా పేర్కొంటున్నారు. ఈ స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు భక్తులు చాలాకాలంగా కోరుతున్నారు. అయితే దర్గా నిర్వాహకులు కొండ శిఖర ప్రాంతంపై తమకు హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నారు. కాగా, సుబ్రమణ్యస్వామి ఆలయ అధికారులు పిళ్లయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలోనే సాంప్రదాయబద్ధంగా దీపం వెలిగిస్తున్నట్లు చెబుతున్నారు (Karthigai Deepam).

తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించే అంశం కొత్త వివాదం కాదు. 1862లోనూ, 1912లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో అధికారులు అనుమతించలేదు. ఆ ప్రాంతంలో దీపం వెలిగించినట్లు తగిన ఆధారాలు లేవని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో కొండపై దీపం వెలిగించే అంశం దశాబ్దాలుగా వివాదంగానే కొనసాగింది. ఈ కొండపై యాజమాన్య హక్కులకు సంబంధించి 1920లోనే న్యాయపోరాటం ప్రారంభమైంది. ఆలయ యాజమాన్యం కొండపై హక్కులను కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది (Deepathoon Controversy).
1923లో సబ్‌కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దాని ప్రకారం కొండలో ఎక్కువ భాగం ఆలయానికి చెందుతుందని, అయితే దర్గా ఉన్న ప్రాంతం, దానికి వెళ్లే మెట్ల మార్గం, నెల్లితోపు ప్రాంతాలు ముస్లిం సమాజానికి చెందుతాయని పేర్కొంది. ఈ తీర్పును 1926లో మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆలయ యాజమాన్యం లండన్‌లోని ప్రివీ కౌన్సిల్‌ను ఆశ్రయించింది. 1931లో ప్రివీ కౌన్సిల్ 1923 నాటి సబ్‌కోర్టు తీర్పునే సమర్థించింది. దీంతో కొన్నేళ్లుగా పిళ్లయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలోనే కార్తీక దీపం వెలిగించే సాంప్రదాయం కొనసాగుతోంది ( Thiruparankundram Hill).

తాజాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపై వివాదాస్పద రాతి స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ఒకసారి మాత్రమే అనుమతిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది (Temple Dargah Dispute). అయితే నవంబరు 24న తమిళనాడు ప్రభుత్వం పిళ్లయార్ ఆలయం సమీపంలోని దీప మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించింది. సుప్రీంకోర్టు అనుమతించిన కొండపై రాతి స్తంభం వద్ద దీపం వెలిగించలేదు. దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ యంత్రాంగం అనుమతి నిరాకరించడం వల్లే ఇలా జరిగిందని తాజాగా తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
విద్యార్థినికి టీచర్ అసభ్యకర సందేశాలు.. అరెస్టు
ఢిల్లీలో మహిళపై సహోద్యోగుల గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్టు