పుణెలో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం!
ABN , Publish Date - Nov 25 , 2026 | 07:59 PM
మహారాష్ట్రలోని పుణె నగరంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం వేచిచూస్తున్న కాలేజీ విద్యార్థులపైకి ఓ వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణె నగరంలో ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం వేచిచూస్తున్న కాలేజీ విద్యార్థులపైకి ఓ వేగంగా వచ్చిన ట్రక్కు (ఐషర్ వాహనం) అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బోప్‌దేవ్ ఘాట్‌లోని గార్వా హోటల్ సమీపంలో మధ్యాహ్నం 1.34 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాల్లో ట్రక్కు అదుపుతప్పి రహదారి పక్కకు వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. వేగంగా వస్తున్న వాహనాన్ని గమనించిన విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసినప్పటికీ, కొందరు ప్రమాదంలో చిక్కుకున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడం లేదా వేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబాలతో రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిలింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారైన వాహనం, డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి:
ఖతర్‌లో తెలుగు కళా సమితి వనభోజనం
కీరవాణి ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ ఆంథమ్.. నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం: సీఎస్ సంజయ్ జాజు