Mohan Bhagwat: బీజేపీని చూసి ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోలేరు: మోహన్ భగవత్
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:33 PM
జన్‌సంఘ్, దాని నుంచి వచ్చిన బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృసంస్థనే విస్తృతాభిప్రాయం ఉందని, అయితే అవి సంఘ్‌కు వ్యతిరేకంగా అల్లుకున్న కథనాలేనని మోహన్ భగవత్ అన్నారు.
భోపాల్: యూనిఫాం, శారీరక వ్యాయామాలు ఉన్నప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) పారామిలటరీ సంస్థ కాదని, బీజేపీని చూసి ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవాలనుకుంటే అది పెద్ద పొరపాటని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. సమాజాన్ని ఏకం చేయడం, భారతదేశం మరోసారి విదేశీ శక్తుల గుప్పిట్లోకి వెళ్లకుండా అవసరమైన లక్షణాలు, సద్గుణాలను నింపడానికి ఆర్ఎస్ఎస్ పని చేస్తుందని భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తెలిపారు.
'మేము యూనిఫాం ధరిస్తాం. కవాతులు, కర్రలతో ఎక్సర్‌సైజ్‌లు చేస్తాం. ఇది చూసి మమ్మల్ని ఎవరైనా పారామిలటరీ సంస్థ అనుకుంటే పొరపడినట్టే. సంఘ్ ఒక విలక్షణ సంస్థ. సంఘ్‌ను అర్థం చేసుకోవడం కష్టం' అని భగవత్ అన్నారు. జన్‌సంఘ్, దాని నుంచి వచ్చిన బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృసంస్థనే విస్తృతాభిప్రాయం ఉందని, అయితే అవి సంఘ్‌కు వ్యతిరేకంగా అల్లుకున్న కథనాలేనని అన్నారు. ఇవాళ ప్రజలు సరైన సమాచారం కోసం లోతుగా వెళ్లడం లేదని, మూలాలకు వెళ్లరని, వికీపీడియాకు వెళ్తుంటారని, అయితే అక్కడి సమచారం అంతా నిజం కాదని పేర్కొన్నారు. ఎవరైతే సంఘ్ గురించి విశ్వసనీయ వనరుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వారికే సంఘ్ గురించి తెలుస్తుందని అన్నారు. ఇలాంటి అపోహల రీత్యా ఆర్ఎస్ఎస్ పాత్ర, మిషన్ గురించి వివరించాల్సిన అవసరం ఏర్పడిందని సంఘ్ శాతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న భగవత్ తెలిపారు.
స్వయం సేవకులకు సంఘ్ తీర్దిదిద్దుతుందని, భారతదేశ పరమ వైభవం కోసం పనిచేసేందుకు విలువలు, ఆలోచన, లక్ష్యాలను పెంపొందిస్తుందని, రిమోట్ ద్వారా నియంత్రించదని భగవత్ వివరించారు. దేశభక్తి వాతావరణాన్ని నిర్మించే కార్మికులను సృష్టించడానికి సంఘ్ తన శాఖల ద్వారా పనిచేస్తుందన్నారు. సంఘ్ అనేది ఒక ప్రతిచర్యగా పుట్టిందనే సాధారణ భావన ఉందని, అయితే అది నిజం కాదని చెప్పారు. సంఘ్ దేనికీ ప్రతిచర్య, వ్యతిరేకం కాదని, సంఘ్ ఎవరితోనూ పోటీ పడటం లేదని అన్నారు. దేశంపై మొదటగా దండెత్తిన వాళ్లు బ్రిటిషర్లు కాదని, భారతీయుల కంటే తక్కువ స్థాయిలో ఉన్న కొందరు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మనలను ఓడించారని చెప్పారు. ఇది ఏడుసార్లు జరిగిందని, ఎనిమిదవ ఆక్రమణదారులు ఆంగ్లేయులని వివరించారు. అలాంటప్పుడు స్వాతంత్ర్యానికి హామీ ఏమిటి? ఇది పదే పదే ఎందుకు జరుగుతోందో మనం ఆలోచించాలని భగవత్ సూచించారు. మనను మనం అర్ధం చేసుకుని స్వార్థానికి అతీతంగా ఎదగాలని, సద్గుణాలతో సమాజం ఏకతాటిపై నిలిస్తే దేశానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రాజకీయ బానిసత్వానికి తెరపడినా, మానసిక బానిసత్వం కొంతవరకూ కొనసాగుతోందన్నారు. దానికి చరమగీతం పాడాలన్నారు. స్వదేశీ అంటే ప్రపంచంతో వాణిజ్యాన్ని తగ్గించుకోవడం కాదని, భారతదేశంలో తయారుకాని మందులు వంటి ముఖ్యమైన వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకోవాలని అన్నారు. వాణిజ్యం అనేది ఒత్తిడి, సుంకాల భయంతో జరక్కూడదని, సొంత నిబంధనల ప్రకారమే జరగాలని సూచించారు.
సంఘ్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని, సంఘ్ ఎప్పుడూ బయట నుంచి వచ్చే నిధులు, విరాళాలపై ఆధారపడదని భగవత్ చెప్పారు. సంఘ్‌ను బాగా అర్థం చేసుకోవాలకుంటే సంఘ్ శాఖలకు రావాలని కోరారు. చక్కెర రుచి గురించి తాను రెండు గంటల పాటు వివరించినా ఒక టీ స్పూన్ చక్కర తాగితేనే అర్థమవుతుందని, అదేవిధంగా శాఖలకు వస్తేనే సంఘ్ గురించి అర్ధమవుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పోలింగ్‌కు ముందే 68 సీట్లలో మహాయుతి గెలుపు
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్స్‌లో న్యూస్ పేపర్ తప్పనిసరి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి