రాపిడో నిర్వాహకులకు రూ. పది లక్షల జరిమానా.. ప్రేరేపించే సందేశాలు నిలిపివేయాలని ఆదేశం
ABN , Publish Date - Sep 16 , 2026 | 10:32 AM
బైక్ టైక్సీ యాప్‌లో రైడ్ బుక్ చేసుకునే సమయంలో ‘క్యాప్టెన్లు ఈ ధరకు అంగీకరించడం లేదు. ఇంకా ₹10, ₹20, ₹30 పెంచి చూడండి’ అని సందేశం వస్తుంది. అయితే ఇది వినియోగదారుడిని ఎక్కువ ధర చెల్లించేలా ప్రభావితం చేస్తోందని సీసీపీఏ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: వినియోగదారులను ప్రేరేపించే సందేశాలను నిలిపివేయాలని ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్ రాపిడో నిర్వాహకులను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు అలాంటి సందేశాలను ఉపయోగించినందుకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. రాపిడోలో రైడ్ బుక్ చేసుకునే సమయంలో ‘క్యాప్టెన్లు ఈ ధరకు అంగీకరించడం లేదు. ఇంకా ₹10, ₹20, ₹30 పెంచి చూడండి’ అని సందేశం వస్తుంది. అయితే ఇది వినియోగదారుడిని ఎక్కువ ధర చెల్లించేలా ప్రభావితం చేస్తోందని సీసీపీఏ తెలిపింది. ఎక్కువ ధర పెడితే కచ్చితంగా రైడ్ బుక్ అవుతుందని యూజర్లు భావించేలా ఈ సందేశాలు ఉన్నాయని చెప్పింది.
ఆగస్టు 31వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో రాపిడో సంస్థ వినియోగదారులను తప్పుదారి పట్టించే డార్క్ ప్యాట్రన్స్ (కన్స్యూమర్స్‌ను మోసం చేయడానికి ఉపయోగించే మార్గాలు) వాడిందని సీసీపీఏ పేర్కొంది. మే 16న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన సీసీపీఏ ఈ విషయాలు వెల్లడించింది. ధర పెంచితేనే రైడ్ దొరుకుతుందనే ఆలోచనలు వినియోగదారుడికి వచ్చేలా సదరు బైక్ ట్యాక్సీ యాప్‌లో సందేశాలున్నాయని వివరించింది.
అలాగే యాప్‌లోని రంగులు కూడా ప్రేరేపించేలా ఉన్నాయని సీసీపీఏ తెలిపింది. రైడ్ కోసం ఎక్కువ ధర పెట్టిన్నప్పుడు.. బుకింగ్ కచ్చితంగా జరగుతుందనే భావం వచ్చేలా ఇంటర్‌ఫేస్‌లో గ్రీన్ రంగు కనిపిస్తోందని, అదే తక్కువ ధర అయితే బుక్ అవ్వకపోవచ్చు అనే భావం వచ్చేలా ఎరుపు, ఆరెంజ్ రంగులు వస్తున్నాయని సీసీపీఏ చెప్పింది.
రాపిడో వాదనను కొట్టేసిన సీసీపీఏ
రైడ్ దొరకనప్పుడు ₹10 పెంచండి.. ₹20 పెంచండి అని వచ్చే సందేశం డార్క్ ప్యాట్రన్ కాదని రాపిడో వాదించింది. అది రైడర్‌కు వినియోగదారుడికి మధ్య జరిగే రియల్ టైమ్ సంభాషణ అని వివరించింది. అయితే సీసీపీఏ మాత్రం ఆ వాదనలను కొట్టేసింది. రైడ్ బుక్ కాకముందే టిప్‌ను అడగడంతో ఇది సమానమని ఆగ్రహించింది. ‘సాధారణంగా సర్వీసు నచ్చితే టిప్ ఇస్తారు. కానీ ఈ సందేశాలు టిప్ ఇస్తేనే సర్వీసు దొరుకుతుంది అని వినియోగదారుడు భావించేలా చేస్తున్నాయి’ అని తెలిపింది.
కాగా మిగతా బైక్ ట్యాక్సీ యాప్‌లను కూడా సీసీపీఏ పరిశీలిస్తోంది. ఆయా యాప్‌లు డ్యార్క్ ప్యాట్రన్స్ వాడుతున్నాయో లేదు విచారణ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
చిన్నారుల అశ్లీల వీడియోలపై దర్యాప్తు సంస్థలకు నివేదిస్తాం: మెటా
నకిలీ ప్రొఫైళ్లు, పెళ్లికూతుళ్లలా టెలీకాలర్లు