మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:24 PM
దేశ మహిళలు ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే సమయం వచ్చిందని, చరిత్ర సృష్టించే ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్ధతు తెలపాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే సమయం వచ్చిందని మంత్రి అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. అందరిని కలుపుకొని పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లు బిల్లును తీసుకొస్తున్నారని, ఆయనకు తెలుగు ప్రజలు, మహిళల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. దేశంలో మహిళలకు చట్టసభలో సరైన ప్రాధాన్యత లేదన్నారు. గతంలో రాజ్యసభలో బిల్లు పాసైందని, లోక్సభలో ఆగిపోయిందని గుర్తుచేశారు. ఈ సారి రెండు సభల్లో బిల్లుకు కచ్చితంగా ఆమోదం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘మహిళలకు చట్ట సభలో సరైన ప్రాధాన్యత లేదు. రాజ్యాంగ సవరణ చేసి వీలైనంత త్వరగా మహిళా బిల్లు తీసుకురావాలని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ సవరణకు 2 /3 మెజార్టీ కావాలి. కాంగ్రెస్ ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు. 850 పార్లమెంట్ స్థానాల్లో 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తే తప్పేంటి? మహిళా బిల్లు పొలిటికల్ బిల్లు కాదు. అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపాలి. గతంలో బిల్లుకు ఆమోదం లభించకపోయినా.. మోదీ పట్టువిడని విక్రమార్కుడిలా మళ్లీ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. మహిళా బిల్లు విషయంలో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించింది. ఈ సారి కూడా టీడీపీ అన్నీ రకాలుగా మద్దతు తెలుపుతుంది. డీ లిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఏ విధమైన అన్యాయం జరగదు’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..