Share News

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

ABN , Publish Date - Nov 28 , 2026 | 09:34 PM

రాజధాని అమరావతిలో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నిర్మాణాల విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ, చదరపు అడుగుకు అయ్యే ఖర్చును ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది.

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..
AP Fact Check

అమరావతి, నవంబర్ 28: రాజధాని అమరావతిలో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నిర్మాణాల విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ, చదరపు అడుగుకు అయ్యే ఖర్చును ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని ఏపీ సర్కార్ ఆరోపించింది. ఈ ప్రచారంలో వాస్తవాలను వక్రీకరిస్తున్నారంటూ ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా వివరణ ఇచ్చింది. ఇటీవల రుషికొండ ప్యాలెస్‌ను ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీంతో అమరావతి నిర్మాణాలపై రాజకీయ వివాదానికి వైసీపీ తెరలేపింది. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణ వ్యయాన్ని ప్రస్తావిస్తూ రాజధాని నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తోంది.


అమరావతిలో ఐదు ఐకానిక్‌ ప్రభుత్వ టవర్ల నిర్మాణం మొత్తం 71.43 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగుతోందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ విస్తీర్ణాన్ని 52.20 లక్షల చదరపు అడుగులుగా వైసీపీ నేతలు చూపిస్తూ నిర్మాణ వ్యయాన్ని అధికంగా లెక్కిస్తున్నారని ఆరోపించింది. మొత్తం నిర్మాణ విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ను లెక్కిస్తే చదరపు అడుగుకు అయ్యే వ్యయం రూ.17,339 మాత్రమేనని ప్రభుత్వం తన ఫ్యాక్ట్‌ చెక్‌లో పేర్కొంది. చదరపు అడుగుకు రూ.29,340 నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. అమరావతి నిర్మాణ వ్యయాన్ని జాతీయ స్థాయిలోని ప్రతిష్ఠాత్మక నిర్మాణాలతో పోల్చి చూడాలని ప్రభుత్వం సూచించింది. నాలుగు అంతస్తులతో నిర్మించిన కేంద్ర పార్లమెంట్‌ భవనానికి చదరపు అడుగుకు రూ.16,916 ఖర్చయిందని పేర్కొంది. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే అమరావతి నిర్మాణాల వ్యయం హేతుబద్ధంగానే ఉందని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ప్రతి మూడు నెలలకోసారి నిర్మాణ అంచనాలు పెరిగిపోయాయంటూ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని, వాస్తవ విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా లెక్కలు చూపడం సరికాదని హెచ్చరించింది.


మరోవైపు, వైసీపీ తప్పుడు ప్రచారంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేశారని గుర్తు చేస్తున్నారు. నిర్మాణ సమయంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ విధించిన రూ.200 కోట్ల జరిమానా అంశాన్నీ ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. రుషికొండ ప్యాలెస్‌లోకి సందర్శకులను అనుమతిస్తే తన బండారం బయటపడుతుందని జగన్ భావిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అందుకే తన సొంత మీడియా ద్వారా అమరావతిపై ఫేక్ ప్రచారానికి తెర లేపారని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. కారు లోయలో పడి ఏడుగురి మృతి

గురుకులాలు, మదర్సాల విద్యపై జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Nov 28 , 2026 | 09:51 PM