Share News

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. కారు లోయలో పడి ఏడుగురి మృతి

ABN , Publish Date - Nov 28 , 2026 | 08:42 PM

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ కారు లోయలో పడి ఏడుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. కారు లోయలో పడి ఏడుగురి మృతి
Uttarakhand Road Accident

డెహ్రాడూన్, నవంబర్ 28: ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ కారు లోయలో పడి ఏడుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రిఖ్నిఖాల్‌లోని కల్వాడి ప్రాంతంలో ఇవాళ (శనివారం) జరిగింది. భంగల్వాడ్ గ్రామానికి చెందిన 12 మంది దీదీ-భూలీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు రిఖ్నిఖాల్‌కు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి గ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యంలో వారి వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.


ఈ ఘటనలో డ్రైవర్ సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ రావత్ అక్కడికి చేరుకున్నారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు, పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురి మృతితో తాను తీవ్రంగా కలత చెందినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరోవైపు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏడుగురు మృతిచెందడం అత్యంత బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని భరించే శక్తిని వారికి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించారు.


ఈ వార్తలు కూడా చదవండి

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

ప్రొటెక్ట్ అవర్ నైబర్స్.. వలసదారుల కోసం డెమొక్రాట్ల కొత్త బిల్లు..

Updated Date - Nov 28 , 2026 | 08:50 PM