నేడే రెండో విడత పల్లె సమరం
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:01 AM
“Second Phase of Rural Electoral Battle Today” జిల్లాలోని రెండో విడత పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల్లోని 146 పోలింగ్ కేంద్రాల్లో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
మధ్యాహ్నం ఒంటిగంట వరకే ఓటింగ్
ఆ తర్వాత కౌంటింగ్.. ఫలితాల వెల్లడి
పార్వతీపురం/పాలకొండ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండో విడత పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల్లోని 146 పోలింగ్ కేంద్రాల్లో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాస్తవంగా నాలుగు మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలు, 1274 వార్డులు ఉన్నాయి. వాటిలో 32 సర్పంచ్, 555 వార్డు సభ్యుల స్థానాలు ఏకగీవమయ్యాయి. మిగిలిన 114 గ్రామ పంచాయతీలు, 719 వార్డులకు ఆదివారం పోలింగ్ జరగనుంది. సర్పంచ్ స్థానాలకు 285 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1542 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తంగా 1.72 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 84,119 మంది, మహిళలు 88,818, ఇతరులు 14 మంది ఉన్నారు. కాగా ఎన్నికల నిర్వహణకు 2,891 మంది సిబ్బందిని నియమించారు. అన్ని పంచాయతీల్లో సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సిబ్బంది ఎన్నికల సామగ్రితో ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ క్రేంద్రాలకు తరలివెళ్లారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత ఓట్లు లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.
జనరల్ అబ్జర్వర్, సబ్ కలెక్టర్ పరిశీలన...
పాలకొండ ఎంపీడీవో కార్యాలయంలోని డిస్ర్టిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీని జిల్లా జనరల్ అబ్జర్వర్ చినరాముడు, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలు పాటించాలని, ఎన్నిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఎం.రాంబాబును ఆదేశించారు. అనంతరం సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనసదుపాయాలపై ఆరా తీశారు.
ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు
భామిని: ఎన్నికల సామగ్రీ పంపిణీ కేంద్రంలో సిబ్బంది ఆకలి కేకలు మిన్నంటాయి. భోజన ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో శనివారం ఎన్నికల సిబ్బంది ఎంపీడీవో వసంతకుమారిని నిలదీశారు. అరకొరగా భోజనాలు పెట్టడం ఏమిటని ఆగ్రహించారు. ఎంపీడీవో డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. చివరకు ఎంపీడీవో భోజన ఏర్పాట్లు చేయడంతో వారంతా శాంతించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేం ద్రాలకు బయల్దేరారు.
640 మందితో బందోబస్తు: ఎస్పీ
బెలగాం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రెండో విడత పంచాయతీ ఎన్నికలకు 640 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. పాలకొండ నియోజకవర్గం నాలుగు మండలాల్లోని 147 పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.