పంచాయతీ ఎన్నికల వివాదం.. కొడుకు, కోడలిని హత్య చేసిన కసాయి తండ్రి
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:39 PM
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తండ్రికి, కొడుక్కి మధ్య జరిగిన వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తండ్రికి, కొడుక్కి మధ్య జరిగిన వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. స్వయంగా తండ్రే కారుతో ఢీకొట్టి కొడుకు, కోడలిని అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ దారుణ ఘటన చూరు జిల్లాలోని తారానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చూరు జిల్లాలోని చంగోయ్ గ్రామానికి చెందిన రామచంద్ర త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆయన నిర్ణయాన్ని కుమారుడు రవీంద్ర తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన రోజు రాత్రి కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో మనస్తాపానికి గురైన రవీంద్ర అర్ధరాత్రి సమయంలో ఇల్లు విడిచి సమీపంలోని వేబ్రిడ్జ్ వైపు వెళ్లాడు. అతడిని ఇంటికి తీసుకెళ్లేందుకు భార్య మహీంద్ర వెళ్ళింది. ఇదే సమయంలో రామచంద్ర కూడా అక్కడి చేరుకున్నాడు. తన కారుతో వారిద్దరిని ఢీకొట్టి తొక్కించాడు. ఈ ఘటనలో కొడుకు రవీంద్ర, కోడలు మహీంద్ర అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న తారానగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు రామచంద్రను అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర మామ ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్నికల గొడవలతో పాటు గతంలోనూ తండ్రీకొడుకుల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో