ఫోన్ దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణికులు.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:14 PM
బీహార్లో మొబైల్ ఫోన్ దొంగతనానికి ప్రయత్నించాడనే అనుమానంతో ఓ వ్యక్తిని ప్రయాణికులు పట్టుకొని చుక్కలు చూపించారు.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే స్టేషన్లో మొబైల్ ఫోన్ దొంగతనానికి ప్రయత్నించాడని అనుమానించిన ఓ వ్యక్తిని ప్రయాణికులు పట్టుకున్న ఘటన బీహార్లో చోటుచేసుకుంది. భాగల్పూర్ జిల్లాలోని శివనారాయణ్పూర్ రైల్వే స్టేషన్లో రైలు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రైలు కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను లాక్కోవడానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా.. కోచ్లో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. అతడు తప్పించుకోకుండా కిటికీలోంచి చేతులను గట్టిగా పట్టుకున్నారు. అప్పటికే రైలు కదలడం ప్రారంభించడంతో ఆ వ్యక్తి రైలు బయట వేలాడుతూ కనిపించాడు. రైలు ముందుకు కదులుతున్నా ప్రయాణికులు అతడిని వదలకపోవడంతో.. పట్టును నిలుపుకోవడానికి అతడు తీవ్రంగా ఇబ్బంది పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రైలు కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి ప్లాట్ఫామ్పై పడిపోయినట్లు.. అక్కడ భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వెల్లడించాయి. అయితే.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, వ్యక్తిపై తీసుకున్న చర్యలపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘జీవితంలో మళ్లీ దొంగతనం ఆలోచన రాదు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘సెల్ ఫోన్ కోసం రిస్క్.. కొంచం ఉంటే ప్రాణాలు పోయేవి..’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇలాంటి వాళ్లకు సరైన శిక్ష’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే.. రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువుల దొంగతనాల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో