Share News

మోదీ, అమిత్‌షాపై మళ్లీ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన బీజేపీ

ABN , Publish Date - May 20 , 2026 | 03:44 PM

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని 'ద్రోహులు'గా పేర్కొన్నారు.

మోదీ, అమిత్‌షాపై మళ్లీ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన బీజేపీ
Rahul Gandhi in Raebareli

రాయబరేలి: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మళ్లీ తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని 'ద్రోహులు'గా పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


'మీ ప్రధానమంత్రి, హోం మంత్రి ద్రోహులు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యక్తులు మీ ముందుకు ఎప్పుడు వచ్చినా బహిరంగంగానే ఈ మాట చెప్పండి. మోదీ, అమిత్‌షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్రోహులు. అంతాకలిసి దేశాన్ని అమ్మేసేందుకు పనిచేస్తున్నారు. రాజ్యంగం, వీర పాసీ, గాంధీ, అంబేడ్కర్‌పై బీజేపీ-ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయి' అని రాహుల్ విమర్శించారు.


పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయని, సామాన్య కుటుంబాలపై పెనుభారం పడుతోందని రాహుల్ అన్నారు. 'దేశ ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రజల బాధలేవీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దేశంలో ఆర్థిక తుపాన్ ముంచుకొస్తోంది. రాబోయే మూడు నాలుగు నెలల్లో గతంలో ఎన్నడూ చూడనంత స్థాయిలో ద్రవ్యోల్బణం ఉండబోతోంది. గ్యాస్, ధాన్యం, ఆయిల్ ధరలు రాబోయే రోజుల్లో ఎంత పెరగబోతున్నాయో మీరే చూడండి' అని రాహుల్ అన్నారు. ఇలాంటి సమయంలో ఉత్తుత్తి నినాదాలు దేశాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ పరిరక్షించలేవన్నారు. ఆర్థిక వ్యవస్థను పారిశ్రామిక వేత్తలు, అమెరికాకు మోదీ అప్పగించేశారని, ఇప్పుడు మాత్రం ప్రజలను విదేశాలకు వెళ్లొద్దని, బంగారం కొనవద్దని సలహాలిస్తున్నారని విమర్శించారు.


తిప్పికొట్టిన బీజేపీ

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వెంటనే తిప్పికొట్టింది. యావద్దేశాన్ని అవమానించేలా రాహుల్ వ్యాఖ్యలున్నాయని తప్పుపట్టింది. 'రాహుల్ ఈ దేశ ప్రజలను అవమానిస్తున్నారు. పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నారు. 140 కోట్ల మంది భారతీయులను ద్రోహులని చేస్తున్నారు. ఆనువంశిక రాజకీయాలకు ప్రతినిధిగా మాట్లాడుతున్న మాటలు ఆయన మైండ్‌సెట్‌కు అద్దంపడుతున్నాయి. అర్బన్ నక్సల్స్ తరహాలో ఆయన మాట్లాడుతున్నారు' అని బీజేపీ విమర్శించింది.


ఇవి కూడా చదవండి..

అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవు... సీపీఎం వార్నింగ్‌పై టీవీకే

కులగణనపై సీజేఐ ధర్మాసనం కీలక తీర్పు

Updated Date - May 20 , 2026 | 05:23 PM