Rahul Gandhi: ఓటు చోరీ ముమ్మాటీకీ దేశద్రోహ చర్యే.. బీఎంసీ ఓట్ల లెక్కింపు వేళ రాహుల్ గాంధీ
ABN , Publish Date - Jan 16 , 2026 | 03:38 PM
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పదారి పట్టిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లిందని ఆరోపించారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారంనాడు వెలువడుతున్నాయి. దీనిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తొలిసారి స్పందించారు. మరోసారి ఎన్నికల సంఘం (EC) తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పదారి పట్టిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లిందని రాహుల్ ఆరోపించారు. 'ఓటు చోరీ దేశద్రోహ చర్య' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ పేర్కొన్నారు.
మరోవైపు, మహారాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ-శివసేనతో కూడిన 'మహాయూతి' కూటమి అధిక్యాన్ని కొనసాగిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మహాయుతి కూటమి 52 వార్డుల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ 35 స్థానాల్లో, శివసేన 17 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఠాక్రేల సారథ్యంలోని శివసేన (యూబీటీ) 22, రాజ్‌థాకరేకు చెందిన ఎంఎన్ఎస్ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ 4 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
బీఎంసీ ఎన్నికల్లో 52.94 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు వెల్లడించింది. ఎనిమిదేళ్ల తర్వాత బీఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి ముందుకు 2017లో ఎన్నికలు జరగగా, మేయర్‌గా ఎన్నికైన కిషోర్ పెడ్నేకర్ పదవీకాలం 2022లో ముగిసింది. తాజా ఫలితాలతో ముంబై నగరానికి నాలుగేళ్ల తర్వాత కొత్త మేయర్ రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన.. నితిన్ నబీన్ ఎన్నికకు మార్గం సుగమం
జస్టిస్ యశ్వంత్ వర్మకు దక్కని ఊరట.. విచారణకు తొలగిన అడ్డంకి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి