BJP New President: 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన.. నితిన్ నబీన్ ఎన్నికకు మార్గం సుగమం
ABN , Publish Date - Jan 16 , 2026 | 02:42 PM
పోలింగ్ అనివార్యమైతే జనవరి 20న ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడి ఎన్నికను ప్రకటిస్తామని లక్ష్మణ్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఈనెల 20న ప్రకటించనున్నట్టు భారతీయ జనతా పార్టీ (BJP) శుక్రవారంనాడు ప్రకటించింది. ఇందుకోసం షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఆ ప్రకారం జనవరి 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య నామినేష్ల దాఖలు ఉంటుందని బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ తెలిపారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. నామినేషన్ల స్క్రూటినీ కూడా మధ్యాహ్నం 4 నుంచి 5 గంటల మధ్య జరుగుతుంది.
పోలింగ్ అనివార్యమైతే జనవరి 20న ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడి ఎన్నికను ప్రకటిస్తామని లక్ష్మణ్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు.
నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. నబీన్ అభ్యర్థిత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా తదితర అగ్రనేతలు బలపరుస్తున్నారు. మొత్తం 5,708 ఓటర్లు (సభ్యులు) బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 5 రాష్ట్రాల నుంచి కనీసం 5 సెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో సెట్‌లోనూ 20 మంది ప్రపోజర్లు ఉంటారు. నామినేషన్ల ప్రక్రియకు మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరుకానున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సైతం పాల్గొంటారు. 30 రాష్ట్రల్లో ఇప్పటికీ బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యారు.
ఇవి కూడా చదవండి..
జస్టిస్ యశ్వంత్ వర్మకు దక్కని ఊరట.. విచారణకు తొలగిన అడ్డంకి
జమ్మూ సరిహద్దులో డ్రోన్ల కలకలం.. భారత్ సైన్యం అలర్ట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి