Drones: జమ్మూ సరిహద్దులో డ్రోన్ల కలకలం.. భారత్ సైన్యం అలర్ట్
ABN , Publish Date - Jan 16 , 2026 | 10:20 AM
భారత్- పాక్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తలు పెరిగాయి. జమ్మూ బార్డర్‌లో పాకిస్థాన్ డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో భారత్ సైన్యం అలర్ట్ అయ్యింది.
న్యూ ఢిల్లీ: ఓ వైపు భారత్‌తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తాం అంటూనే.. మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్. గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (LOC) వెంబడి రెండు పాక్ డ్రోన్లు సంచరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల కదలికలు చూసిన వెంటనే భారత సైన్యం స్పందించి యాంటీ-డ్రోన్ ఆపరేషన్ చేపట్టడంతో అవి వెనుదిరిగాయి. ఈ వారంలోనే ఇలా జరగడం మూడోసారి అంటున్నారు.
పాకిస్థాన్‌కు భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గణతంత్ర దినోత్సవం వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. డ్రోన్ల కదలికల తర్వాత ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మంగళవారం రాత్రి, రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) దాటి భారత భూభాగంలోకి వచ్చిన అనుమానిత పాక్ డ్రోన్లను అడ్డగించడానికి ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపారు.
ఇవి కూడా చదవండి
ఆ కుక్కకు ఏమైంది.. నాలుగు రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు
సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండలం: సీఎం చంద్రబాబు