Share News

‘మోదీజీ.. యూపీఐ పన్నును వెనక్కి తీసుకోండి’: రాహుల్‌ గాంధీ

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:30 PM

యూపీఐ లావాదేవీలపై కొత్తగా తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (MDR) విధానంపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. దీనిని ‘యూపీఐ పన్ను’గా పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై విమర్శలు చేశారు.

‘మోదీజీ.. యూపీఐ పన్నును వెనక్కి తీసుకోండి’: రాహుల్‌ గాంధీ
Rahul Gandhi On UPI Charges

ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ లావాదేవీలపై కొత్తగా తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (MDR) విధానాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా విమర్శించారు. దీనిని ‘యూపీఐ పన్ను’గా అభివర్ణిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిర్ణయం అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని ఆయన ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. MDR పన్ను కాదని, దాని భారాన్ని వినియోగదారులపై వేయబోమని స్పష్టం చేసింది.


కొత్త విధానం ప్రకారం.. అక్టోబర్‌ 15 నుంచి నిర్దిష్ట వ్యాపార UPI లావాదేవీలకు రూ. 2,000 దాటిన మొత్తంపై 0.4 శాతం MDR వర్తిస్తుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ. 300కు పరిమితం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే UPI చెల్లింపులకు ఈ ఛార్జీ వర్తించదు. అలాగే రూ. 2,000 వరకు జరిగే వ్యాపార లావాదేవీలు, చిన్న వ్యాపారులకు వర్తించే జీరో-MDR విధానంలోని లావాదేవీలు ఉచితంగానే ఉంటాయని కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం P2M లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కావని స్పష్టం చేసింది.


MDRను ప్రభుత్వం లేదా NPCI వసూలు చేసే పన్నుగా పరిగణించకూడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చెల్లింపుల వ్యవస్థను నిర్వహించే బ్యాంకులు, పేమెంట్‌ యాప్‌లు తదితర భాగస్వాములకు ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తామని తెలిపింది. UPI వ్యవస్థను దీర్ఘకాలం కొనసాగించేందుకు, దాని నిర్వహణ, విస్తరణకు ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించింది.

అయితే రాహుల్‌ గాంధీ మాత్రం కేంద్రం వివరణను అంగీకరించలేదు. UPIపై ఛార్జీలు విధించడం ద్వారా అమెరికన్‌ కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందు తలొగ్గారని విమర్శిస్తూ.. UPI ఛార్జీల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విధానంపై కాంగ్రెస్‌ కూడా కేంద్రాన్ని విమర్శించింది. అయితే ప్రభుత్వం మాత్రం UPIకి సంబంధించిన విధాన నిర్ణయాలను భారత్‌ స్వతంత్రంగా తీసుకుంటోందని, వినియోగదారులకు UPI సేవలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Also Read:

164 వెటర్నరీ పోస్టులపై అసత్య ప్రచారాన్ని ఖండించిన పశుసంవర్ధక శాఖ

హత్రాస్‌.. ఉన్నావ్‌.. ఆర్జీ కర్‌.. ఇప్పుడు దిశా సాలియన్ కేసు.!

Updated Date - Sep 16 , 2026 | 05:33 PM