Share News

పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. హెరాయిన్, ఆయుధాలు స్వాధీనం

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:35 PM

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో భారీ ఎత్తున డ్రగ్స్, ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వీరి నుంచి 43 కిలోల హెరాయిన్, పలు ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. హెరాయిన్, ఆయుధాలు స్వాధీనం

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గురువారం భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాలను రవాణా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు అమృత్‌సర్ పోలీసులు. విలేజ్ డిఫెన్స్ కమిటీ(VDC) అందించిన సమాచారం మేరకు అమృత్‌సర్ రూరల్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో హెరాయిన్, మందుగుండు సామగ్రి సహా ఓ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దాడుల్లో సుమారు 43 కిలోల హెరాయిన్, 4 హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక స్టార్ మార్క్ పిస్టల్, 46 బులెట్లు సహా ఓ బైక్‌నూ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ సభ్యుల అప్రమత్తత వల్లే ఈ స్మగ్లింగ్‌ను ఛేదించామని డీజీపీ తెలిపారు.

ఈ కేసులో అమృత్‌సర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ కాగా.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అక్కడకు ఆ ఆయుధాలు, హెరాయిన్ ఎలా వచ్చాయి? దాని వెనకున్న పరిస్థితులు ఏమిటనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు డీజీపీ వెల్లడించారు.


ఇవీ చదవండి:

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమన్న ప్రధాని

అజిత్ పవార్ తరువాత ఎవరు? కీలక మలుపులో ‘మహా’ రాజకీయాలు

Updated Date - Jan 29 , 2026 | 01:20 PM