Share News

అజిత్ పవార్ తరువాత ఎవరు? కీలక మలుపులో ‘మహా’ రాజకీయాలు

ABN , Publish Date - Jan 28 , 2026 | 10:17 PM

అజిత్ పవార్ తరువాత ఎన్సీపీని ముందుండి నడిపించేదెవరన్న అంశంపై మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అజిత్ పవార్ తరువాత ఎవరు? కీలక మలుపులో ‘మహా’ రాజకీయాలు
Ajit Pawar

ఇంటర్నెట్ డెస్క్: అజిత్ పవార్ కన్నుమూతతో ఎన్సీపీ పార్టీ భవిష్యత్తు కీలక మలుపులో నిలిచింది. పవార్ తరువాత పార్టీని ముందుకు నడిపేది ఎవరన్న ప్రశ్న అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇప్పటివరకూ ఎన్సీపీకి పవార్ కుటుంబమే నాయకత్వం వహించిందని అక్కడి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చేపట్టేందుకు రెండు పవర్ సెంటర్స్‌కు అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

అజిత్ పవార్ నుంచి నాయకత్వ బాధ్యతలను ఆయన భార్య సునేత్రా పవార్ చేపడతారని కొందరు చెబుతున్నారు. ఈ భావోద్వేగ సమయంలో ప్రజలు, అభిమానుల మద్దతు ఆమెకే ఉండే అవకాశం ఉంది. అయితే, రాజకీయాలకు సునేత్ర కొత్త అని కొందరు చెబుతున్నారు. సునేత్ర 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే, పార్టీలో సీనియర్ నాయకులను ముందుండి నడిపించేందుకు ఈ అనుభవం చాలదని అనే వారూ ఉన్నారు. ముఖ్యంగా అనుభవజ్ఞులైన ఛగన్ భుజ్‌బల్, సునీల్ టట్కారే నుంచి ఆమెకు పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది

ఇక అజిత్ పవార్ తనయులు, పార్థ్, జైలకు కూడా పార్టీ పగ్గాలు లభించే చాన్సుంది. అయితే, తల్లితో పోలిస్తే వీరి రాజకీయ అనుభవం మరింత తక్కువ అనేవారు లేకపోలేదు. అజిత్ తరువాత పార్టీ బాధ్యతలు పార్థ్ చేపడతారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్థ్‌కు ఐదు లక్షల పైచిలుకు ఓట్లు సాధించినా ఓటమి తప్పలేదు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు పార్థ్ కాస్త దూరంగా ఉంటున్నట్టు కనిపించారు. ఆయన రీఎంట్రీకి మద్దతుతో పాటు ఎదురుగాలులూ తప్పవనే టాక్ ఉంది. ఇక పార్థ్ సోదరుడు జై కుటుంబ వ్యాపారాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టడంతో ఆయన నిర్ణయంపై కూడా సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకూ జై ఎన్నికల్లో పోటీ చేయలేదు.


ఇక పార్టీలో అజిత్ తరువాత సీనియర్లు భుజ్‌బల్, ప్రఫుల్ పటేల్, టట్కారేలకు కేడర్‌ను ముందుండి నడిపించే సామర్థ్యం, అనుభవం ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని అక్కడి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అజిత్ తరువాత పార్టీలో అత్యంత సీనియర్ నేతగా పటేల్ ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్సీపీ చీలిక సమయంలో ఆయన ఢిల్లీలో అజిత్ తరుపున కీలకంగా వ్యవహరించారు. అయితే, పార్టీ వర్గాల్లో ఆయనకు అజిత్ పవార్ స్థాయిలో మద్దతు పలుకుబడి లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ, ఈ క్లిష్ట సమయంలో పటేల్ నాయకత్వం పార్టీకి ఎంతో అవసరమనేది మరికొందరి వాదన.

అజిత్ పవార్ లాగా చిన్న స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన నేత సునీల్ టట్కారే. రాజకీయ వ్యూహాలు రచించడంలో, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో మంచి పట్టున్న వ్యక్తి అని మహారాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆయన మహారాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ రాష్ట్రస్థాయి పాప్యులారిటీ మాత్రం ఆయనకు లేదని కొందరి వాదన. ఇక అజిత్ పవార్ మాటమీద శరద్ పవార్‌ను కాదనుకున్న నేతలు చివరకు ఆయనకే మళ్లీ జైకొడతారా? అనేది అంశం అక్కడి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఇవీ చదవండి:

అజిత్ పవార్ విమాన ప్రమాదం.. ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు.. వైరల్ వీడియో

ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన

Updated Date - Jan 28 , 2026 | 10:27 PM