Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు.. వైరల్ వీడియో
ABN , Publish Date - Jan 28 , 2026 | 09:37 PM
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలే కొద్ది క్షణాల ముందు గాల్లో ఓ పక్కకు వొంపు తిరిగినట్టు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నేడు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు విమానం ఎడమవైపునకు వొంపు తిరిగి కిందకు దూసుకొస్తున్నట్టు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది (Ajit Pawar Plane Crash Viral Video).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, విమానం వేగంగా నేలవైపు దూసుకువచ్చింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు విమానం ఎడమవైపు వొంపు తిరిగినట్టు కనిపించింది. ల్యాండింగ్‌కు ముందు ఇలా జరగడం అసాధారణ విషయమని వైమానిక రంగ నిపుణులు చెబుతున్నారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపానికి ప్రతి క్రియగా పైలట్ విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించి ఉంటారనేందుకు ఇది ఒక సూచిక అయి ఉండొచ్చని చెబుతున్నారు.
వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన ఈ ప్రైవేటు విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేడు ముంబై నుంచి బారామతికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టుకు సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా పైలట్‌లకు వాతావరణానికి సంబంధించి అప్‌డేట్స్ లభించాయి. 3 కిలోమీటర్ల లోపు ఉన్నవి కనిపించే స్థాయిలో విజిబులిటీ ఉన్నట్టు సమాచారం. సురక్షిత ల్యాండింగ్‌కు ఇది అనుకూలమేనని నిపుణులు చెబుతున్నారు.
అయితే, కిందకు దిగే సమయంలో ల్యాండింగ్ స్ట్రిప్ సరిగా కనిపించట్లేదని పైలట్‌లు చెప్పడంతో మరో రౌండ్ తిరిగి రావాలని గ్రౌండ్ కంట్రోల్ నుంచి సూచనలు అందాయి. ఈ క్రమంలో మరోసారి ప్రయత్నించే క్రమంలో ల్యాండింగ్‌కు అనుమతి కూడా లభించింది. ఆ తరువాత కొన్ని నిమిషాలకే విమానం నుంచి సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఇక సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, ఉదయం 8.44 గంటల సమయంలో విమానం వంపు తిరిగి కిందకు దూసుకెళుతున్నట్టు కనిపించింది.
ఇవీ చదవండి:
ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన
1977లో విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ ప్రధాని..