1977లో విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ ప్రధాని..
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:36 PM
1977 నవంబర్ 4వ తేదీన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రయాణిస్తున్న ‘టుపోలెవ్ టు 124’ విమానం ప్రమాదానికి గురైంది. అస్సాం, జోర్హాట్ జిల్లాలోని పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు.
ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ జెట్‌లో పబ్లిక్ మీటింగ్‌కు వెళుతుండగా బారామతి వద్ద విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో దేశానికి చెందిన ప్రముఖ నాయకులు పలువురు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సంజయ్ గాంధీ, మాధవ్‌రావ్ సింధియా, విజయ్ రూపానీ, వైఎస్ రాజశేఖరెడ్డి విమాన ప్రమాదంలో చనిపోయారు. వీరందరికీ భిన్నంగా.. అందర్నీ ఆశ్చర్యపరిచేలా..1977లో జరిగిన భారీ విమాన ప్రమాదంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రాణాలతో బయటపడ్డారు.
తృటిలో తప్పించుకున్న మొరార్జీ దేశాయ్..
1977 నవంబర్ 4వ తేదీన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రయాణిస్తున్న ‘టుపోలెవ్ టు 124’ విమానం ప్రమాదానికి గురైంది. అస్సాం, జోర్హాట్ జిల్లాలోని పొలాల్లో కుప్పకూలింది. ఢిల్లీలోని పాలమ్ ఎయిర్‌పోర్టు నుంచి జోర్హాట్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నవంబర్ 4వ తేదీ రోజు సాయంత్రం విమానం జోర్హాట్‌లోని రన్‌వేపై ల్యాండ్ అవుతోంది. అయితే, ఆల్టిట్యూట్ సమస్య కారణంగా ల్యాండ్ కావాల్సిన విమానం గాల్లోకి లేచింది. భారీ శబ్ధం చేస్తూ ఎయిర్‌స్ట్రిప్‌కు చాలా దూరంగా వెళ్లిపోయింది. వరి పొలంలో కూలిపోయింది. కాక్‌పిట్ పూర్తిగా బాడీనుంచి విరిగిపోయింది.
దీంతో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు. అయితే, 81 ఏళ్ల మొరార్జీ దేశాయ్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమాన శిథిలాల కింద చిక్కుకున్న మొరార్జీ దేశాయ్‌ని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఆయన మాత్రం ఎంతో ఆత్మ స్థైర్యంతో కామ్‌గా ఉండిపోయారు. తనతో పాటు ప్రాణాలు దక్కించుకున్న వారికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ నేత పీకే తుంగన్, ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి, మొరార్జీ దేశాయ్ కుమారుడు కాంతీభాయ్, సామాజిక కార్యకర్త నారాయణ్ దేశాయ్‌లు మొరార్జీ దేశాయ్‌తో పాటు ఈ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి
ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’
రాజ్యాంగ నిష్ఠను త్యజిస్తున్న గవర్నర్లు!