Share News

ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’

ABN , Publish Date - Jan 28 , 2026 | 07:26 PM

మారుమూలన ఉన్న ఓ వనారణ్యం రెండేళ్లకోసారి జనారణ్యమై భాసిల్లడానికి జాతరలోని విభిన్నతే కారణం. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఈ జాతర నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఆదివాసీల అరుదైన పూజా విధానాలతో, తీరొక్క మొక్కులతో అబ్బురపరుస్తుంది.

ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’

మేడారం జాతరను ఎన్నిసార్లు చూసినా, అక్కడి ఆదివాసీ సంప్రదాయాలతో ఎన్నిసార్లు సహానుభూతి చెందినా తనివి తీరదు. ప్రతీసారి ఏదో ఒక విభిన్నత అనుభవంలోకి వచ్చి భావోద్వేగాన్ని కలిగిస్తుంది. తెలంగాణ నేల స్వభావానికి, సాంస్కృతిక వైభవ పరంపరకు మేడారం నిలువెత్తు ప్రతీక. మూలవాసుల అస్తిత్వానికి పతాక చిహ్నమై, ప్రకృతితో పెనవేసుకున్న వారి ఆచార వ్యవహారాలకు సంకేతమై శరీరాన్ని రోమాంచితం చేస్తుంది. మేడారం జాతర రెండేళ్లకోసారి జరిగే పండుగ మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. ప్రకృతిలోకి ప్రయాణం చేసి పొందే తాదాత్మ్యత. అక్కడేదో మహత్తు ఉంది.


మేడారంలో కొలువైన సమ్మక్క, సారలమ్మలకు సంబంధించి జనశ్రుతుల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాళ్లు కోయ పాలకులని, కాకతీయులకు సామంతులని, కప్పం కట్టలేక ప్రజల కోసం వారిని ఎదిరించి యుద్ధంలో ప్రాణాలను త్యజించిన వీరులనీ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు వాళ్లు పుట్టు దేవతలని, చల్లని తల్లులని, కోరిన కోర్కెలు తీర్చే దైవాలని ఆదివాసీలు కథలు కథలుగా చెప్పుకుంటారు, తమ ఇలువేల్పులుగా కొలుస్తారు. ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కథనాలకు తోడుగా, కాలక్రమంలో అనేక కొత్త కథనాలూ వ్యాఖ్యానాలూ పుట్టుకువస్తున్నాయి.


ఎన్ని ప్రచారాలు, కథనాలు ఉన్నా సమ్మక్క సారలమ్మలు... భక్తకోటి గుండెల్లో దైవాలుగా వెలుగొందుతున్నారు. కోరిన కోర్కెల్ని తీర్చే మహిమాన్విత శక్తులుగా, వీరత్వానికి ప్రతీకలుగా విరాజిల్లుతున్నారు. పోరాటాలకు, ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. మేడారం మొన్నటివరకు కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు. ఊరట్టం అనే పంచాయతీలో ఆవాస గ్రామం. పట్టుమని వెయ్యి మంది జనాభా కూడా లేని ఓ మారుమూల పల్లె. కానీ అక్కడ కొలువైన వనదేవతల మూలంగా ఆ పల్లె రెండేళ్లకోసారి కోటి మందిని తన దగ్గరకు రప్పించుకుంటుంది.


మారుమూలన ఉన్న ఓ వనారణ్యం.. రెండేళ్లకోసారి జనారణ్యమై భాసిల్లడానికి జాతరలోని విభిన్నతే కారణం. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఈ జాతర నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఆదివాసీల అరుదైన పూజా విధానాలతో, తీరొక్క మొక్కులతో అబ్బురపరుస్తుంది. గుడి ఉండదు.. గోపురాలు ఉండవు, ధ్వజస్తంభం ఉండదు.. ద్వారపాలకులు ఉండరు, అర్చకులు ఉండరు.. ఆర్జిత సేవలూ ఉండవు. నాలుగు వృత్తాకార గద్దెలపై, నడుమ పాతిన కర్రలే దైవాలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. జాతర వేళ కుంకుమ భరిణెలను ప్రతిష్ఠించినా అవి బయటకు కనిపించవు. మేడారంలో సమ్మక్క, సారలమ్మలు భౌతిక రూపాల్లో దర్శనమివ్వరు. వారు పూర్తి అమూర్తంగా ఉంటారు. జంపన్నవాగులో పుణ్యస్నానం చేసి, గద్దెల వద్దకు వచ్చి ‘సల్లంగ సూడు సమ్మక్క తల్లీ..’ అని రెండు చేతులెత్తి ప్రార్థించడంతో మొక్కు పూర్తవుతుంది. అక్కడ నిర్వచించలేని ఓ నమ్మకం, విశ్వాసం నిటారుగా నిలబడిన దాఖలా కనిపిస్తుంది. అదొక రహస్య జగత్తు.


జాతర ఆద్యంతం అలుముకునే ఉద్విగ్నత ప్రతీ ఒక్కరిని సమ్మోహనుల్ని చేస్తుంది. నిండు పౌర్ణమి వేళ సమ్మక్క, సారలమ్మ రాక, గద్దెలపై కొలువుదీరే ఘట్టాలు మేడారం అటవీప్రాంతాన్ని భక్తిపారవశ్యపు శిఖరాగ్రాన నిలబెడతాయి. తొలిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, రెండోరోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువచ్చే ఘట్టాలను ప్రత్యక్షంగా చూడటం జీవితకాల జ్ఞాపకం. ఈ రెండు ఘట్టాలు సాయంత్రం 5 గంటలకు మొదలై రాత్రి 8 గంటల కల్లా పూర్తవుతాయి. ఆ వ్యవధిలో మేడారం భక్తజన సంద్రమై ఉప్పొంగుతుంది. లక్షలాది కోళ్లూ, యాటలూ తలలు తెంచుకొని తల్లులకు రక్తాభిషేకం చేస్తాయి. శివసత్తులు శిగాలూగుతూ అపర వనదేవతలై వీరంగమాడుతారు. తల్లులను తరలించే ఆదివాసీ వడ్డెలను (పూజారులు) తాకడం కోసం దారిపొడవునా జనం పోటెత్తుతారు. తల్లులు గద్దెలపైకి చేరడంతోనే మేడారం... నిండు పున్నమి వెలుగులో దైవక్షేత్రంగా రూపుదాల్చి జేగీయమానమవుతుంది. మొక్కులు ఊపందుకుంటాయి. తల్లుల చెంతకు భక్తులు వెల్లువెత్తుతారు. ఆ సమయంలో గద్దెల ప్రాంగణమే కాదు, మేడారం యావత్తూ అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.


ఆదివాసీల పూజావిధానాలు సామాన్యుల జీవన రీతులకు దగ్గరగా, వారి ఆర్థికస్థాయికి తగినట్టుగా ఉంటాయి. అందుకే సమ్మక్క, సారలమ్మలు ఆదివాసులకే కాదు, ఆదివాసీయేతరులకూ ఇష్టదైవాలుగా వెలుగొందుతున్నారు. ఎంతో చవక అయిన బెల్లంను బంగారంగా అప్పగించడం, ఒడి బియ్యం పోయడం, చీరసారెలు సమర్పించడం, ఎదురుకోళ్లను ఎగరేయడం, కోళ్లు, యాటలను బలి ఇవ్వడం.. ఇలా అనేకరకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఇతర తీర్థయాత్రలతో పోల్చుకుంటే మేడారం యాత్ర ఖర్చు తక్కువ. అందుకే ఇది సామాన్యుల జాతరగా విలసిల్లుతోంది.


ఆదివాసులకు పండుగలు, జాతరలు అంటే ఒక వినోదం. తమ రోజువారీ జీవితాల నుంచి ఉపశమనం పొందే ఘట్టం. అందుకే మేడారం జాతర విందూవినోదాల సమాగమంగా సాగుతుంది. మందు, మాంసం లేనిదే పూట గడవదు. ఆటపాటలు లేనిదే జాతర ప్రయాణం పరిపూర్ణం కాదు. దేవతల దర్శనానికి ముందూ తర్వాతా జాతరలో భక్తులకు ఎలాంటి కట్టుబాట్లు ఉండవు. నెలసరిలో ఉన్న మహిళలు, అయిన వాళ్లను కోల్పోయి సుష్టులో ఉన్నవారు సైతం దర్శనం చేసుకుంటారు. ముహూర్తాలు, ఘడియలు, వర్జ్యాలు, అమావాస్యలు, వారాలు ఇక్కడ లెక్కలోకి రావు. దేవతలకు, భక్తులకు మధ్య సంధానకర్తలు ఉండరు. ఈ పద్ధతులే సమస్త జనాన్ని సమ్మక్క, సారలమ్మలకు పరమ భక్తులను చేశాయి. ఏపీ, తెలంగాణ నుంచే కాదు, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మేడారం బాట పడతారు.


కాలం ఎంత మారుతున్నా, ఆధునికత ఎంత చుట్టుముడుతున్నా మేడారం తన అస్తిత్వ మూలాలను చేజార్చుకోలేదు. బ్రాహ్మణీయ విధానాలను చొప్పించే ప్రయత్నాలు జరిగినప్పుడల్లా ఆదివాసీలు వడిసెల రాళ్లలా ఎదురుదాడికి దిగిన సంఘటనలు ఎన్నో. అభివృద్ధికి, విస్తరణకు సహకరిస్తూనే వారు మేడారం జాతర అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. ఒకప్పుడు మేడారం రావాలంటే ఎగుడుదిగుడు మట్టిదారుల్లో ఎడ్లబండ్లే శరణ్యం. గత 30 ఏళ్లుగా ఇక్కడ ఎంతో అభివృద్ధి కనిపిస్తోంది. పాలకులు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రోడ్డు రవాణా సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయి.


ఈసారి జాతరకు మేడారం కొత్త రూపును సంతరించుకోవడం విశేషం. రూ.101 కోట్ల వ్యయంతో గద్దెలు, గద్దెల ప్రాంగణం చుట్టూ పాలరాతి మహా ద్వారాలను, వృత్తాకార నిర్మాణాలను పాలకులు ఏర్పాటు చేశారు. ద్వారాలపై ఆదివాసీల గొట్టు, గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలకు సంబంధించిన చిత్రాలను శిల్పాలుగా చెక్కించారు. మొన్నటివరకు వనదేవతల గద్దెలు ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా కనిపించేవి. ఇప్పుడు పాలరాతి మహాద్వారాలు, వలయాకార నిర్మాణాల మూలంగా అవి మునుపటి ప్రభను కోల్పోయాయనే అభిప్రాయం ఉన్నా, దేవతలపై భక్తులకున్న అపార విశ్వాసం, నమ్మకం ముందు అవేవీ అడ్డంకిగా కనిపించడం లేదు. మేడారం చరిత్రను శాశ్వతం చేసి, జాతర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడం, వనదేవతల దర్శనాన్ని మరింత సులభం చేయడం కోసమే గద్దెల విస్తరణ, అభివృద్ధిని చేపట్టినట్టు ప్రభుత్వం చెబుతున్న వాదనకు మద్దతు బాగానే ఉంది. మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులకు గుర్తుగా తొలిసారిగా వనదేవతల చెంతన క్యాబినెట్‌ సమావేశం నిర్వహించి ప్రస్తుత ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.


మేడారం.. జనాన్నే కాదు, పాలకులను కూడా కదిలించగల అపూర్వ క్షేత్రం. అందుకే భక్తకోటి సేవలో తరించేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా ఇక్కడే మకాం వేస్తుంది. నాలుగు రోజుల పాటు మారుమూల అడవిపల్లె.. మహానగరమై ప్రకాశిస్తుంది.

- శంకర్‌రావు శెంకేసి

(నేటి నుంచి మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర)

Updated Date - Jan 29 , 2026 | 12:09 AM