Share News

రాజ్యాంగ నిష్ఠను త్యజిస్తున్న గవర్నర్లు!

ABN , Publish Date - Jan 28 , 2026 | 07:16 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడకుండా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, చర్యలను సరిదిద్ది, సమన్వయం చేసేందుకు గవర్నర్‌ పదవీ బాధ్యతలు ఉపయోగపడతాయి. మరి గవర్నర్లు రాజ్యాంగ నిష్ఠతో వ్యవహరిస్తున్నారా? నిజానికి ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసేటప్పుడు రాష్ట్రాలను విధిగా సంప్రదించాలని సర్కారియా కమిషన్‌కు బీజేపీ విన్నవించింది. మరి ఇప్పుడు అలా సంప్రదిస్తున్నారా?

రాజ్యాంగ నిష్ఠను త్యజిస్తున్న గవర్నర్లు!

కొన్ని రాజ్యాంగ పదవులు అలంకార ప్రాయంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అటువంటి వాటిలో కీలకమైనది రాష్ట్ర గవర్నర్ పదవి. బ్రిటిష్ పాలనా కాలం నాటి అనేక అవశేషాలను, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసిన, అనేక సంస్థల, చిహ్నాల, చట్టాల పేర్లను మార్చేసిన మోదీ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌ పదవిని మాత్రం ఎందుకో కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి అధికార నివాసం ఉన్న రేస్‌కోర్స్ రోడ్ లోక్ కల్యాణ్ మార్గ్‌గా మారింది. ప్రధానమంత్రి కార్యాలయం లోక్‌తీర్థ్‌గా అవతరించింది. ప్రణాళికా సంఘానికి నీతీ ఆయోగ్‌గా పునఃనామకరణం చేశారు. రాజ్‌పథ్ కర్తవ్య పథ్‌గా రూపొందింది. శీతాకాల సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు వీబీ–జీరామ్– జీగా మారిపోయింది. ఈ ఒరవడిలో గవర్నర్ నివాసాలు అయిన రాజభవన్లు లోక్‌భవన్‌లుగా మారిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం అప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలున్న భవనాన్ని లోక్‌భవన్‌గా భావిస్తున్నందువల్ల ఆ రాష్ట్ర గవర్నర్ తన అధికార నివాసానికి జనభవన్‌గా పేరు పెట్టుకున్నారు. నిజానికి గవర్నర్ అన్న పేరు కూడా బ్రిటిష్ భావజాలాన్ని ప్రతిబింబించేదే. బహుశా ఆ పేరును మార్చి మరో మంచి పేరు పెట్టాలన్న ఆలోచన ప్రధాని మోదీకి వచ్చేవరకు ఆ పేరు అదే విధంగా కొనసాగవచ్చు.


ప్రజాస్వామ్యంలో రాచరికం అన్న పదానికి అర్థం లేదు. అందువల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా రాజ్‌భవన్‌లకు లోక్‌భవన్‌లుగా పేరు పెట్టడం పూర్తిగా సమంజసమే. రాష్ట్ర గవర్నర్లు నివసించే లోక్‌భవన్‌లు చాలా మటుకు బ్రిటిష్ కాలం నాటి దర్పాన్ని ప్రతిబింబిస్తూ అనేక ఎకరాల్లో, విశాలమైన ప్రాంగణాల్లో ఉన్నాయి. కేవలం రాష్ట్ర రాజధానుల్లోనే కాదు, కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో కూడా విశాలమైన భవన్‌లు గవర్నర్‌ల అధీనంలో ఉంటాయి. లోక్‌భవన్‌ల ద్వారాలు తెరిచి ప్రజలకు తమను కలుసుకునే అవకాశం కల్పించే గవర్నర్లు ఎంతమంది ఉన్నారు? ప్రజల వద్దకు తమకుతాముగా వెళ్లే గవర్నర్లూ తక్కువే కదా. అయినా ప్రజలు తమను కలిసినంత మాత్రాన గవర్నర్లు వారికి ఏమి చేయగలరు? కలుసుకున్నవారికి ఉత్సవ విగ్రహాలను చూశామన్న తృప్తి మినహా మరేమీ సమకూరదు కదా. మరి గవర్నర్లు ఏమీచేయనప్పుడు వారు నివశించే భవన్‌ల పేరు మార్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగేది ఏమున్నది?


రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రకారం పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిధిలో పనిచేయాల్సిన గవర్నర్ పదవి అలంకార ప్రాయమైనది. అయినా గవర్నర్లు చాలా మంది తమ ఉనికిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ శాసనసభలో ఆనవాయితీ ప్రకారం గవర్నర్‌ ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించారు. కారణమేమిటి? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తీసేసి విబి–-జీరామ్– జీ అనే కొత్త పేరు పెట్టినందుకు కేంద్రాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రసంగాన్ని రూపొందించడమే. తప్పుడు ప్రకటనలు, లెక్కలేనన్ని అవాస్తవాలు ఉన్నాయని విమర్శిస్తూ తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఏకంగా తన ప్రసంగంలో కొన్ని పేరాలను మార్చేసి చదివారు. రాజ్యాంగ అధికరణ 163 ప్రకారం గవర్నర్ మంత్రిమండలి సలహా ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. అధికరణ 176 ప్రకారం గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుంది. మంత్రిమండలి ఆమోదించిన ప్రసంగానికే రాజ్యాంగబద్ధత ఉంటుంది. అయితే ఎక్కడా ఆ ప్రసంగం ఫలానా విధంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించనప్పుడు గవర్నర్ ఏమి చేయాల్సి ఉంటుంది?


‘బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను వేధించేందుకే గవర్నర్లు కంకణం కట్టుకున్నారు. ప్రభుత్వాలు రూపొందించిన ప్రసంగాలు చదవవద్దని నుంచి వారికి ఆదేశాలు వస్తున్నాయి. కేంద్రం చేతుల్లో గవర్నర్లు కీలుబొమ్మలుగా మారిపోయారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఎన్నికైన ప్రభుత్వాల గొంతు నొక్కేందుకే గవర్నర్లను ఉపయోగించుకుంటున్నారని రాహుల్‌గాంధీ గతంలో వ్యాఖ్యానించారు. బీజేపీ నియమించిన గవర్నర్లందరూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు కాని గవర్నర్ల గురించి విమర్శలు చేసేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి నైతిక అధికారమూ లేదు. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగపరచడంలో కాంగ్రెస్‌ ఘనాపాటి కాదూ? కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో కూడా గవర్నర్లు కీలుబొమ్మలుగా వ్యవహరించారు. గుజరాత్‌లో మోదీ ప్రభుత్వం కూడా అప్పటి గవర్నర్‌ను తప్పుపట్టింది. ఇప్పుడు ఆ చరిత్ర మరో విధంగా పునరావృతమవుతోంది. కాంగ్రెస్ నాడు అవలంబించిన వైఖరి వల్లే బీజేపీ ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అనేందుకు దారితీసింది.


అయితే అప్పటి పరిస్థితులకూ ఇప్పటి పరిస్థితులకూ తేడా ఉన్నది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు నాటి గవర్నర్ రామ్‌లాల్‌ను ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుందో అందరికీ తెలుసు. అయితే ప్రజలు తిరగబడడంతో రామ్‌లాల్‌ను తొలగించి శంకర్‌దయాళ్ శర్మను నియమించారు. బిహార్‌లో నితీశ్‌ కుమార్‌కు మెజారిటీ నిరూపించుకునే అవకాశం కల్పించకుండా సభను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించినందుకు నాటి గవర్నర్ బూటాసింగ్‌ను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. గత్యంతరం లేక ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అధికరణ 356ను దుర్వినియోగపరిచి రాష్ట్రపతి పాలనను తరుచూ విధించే సంప్రదాయాన్ని పాటించి కాంగ్రెస్ అనేకసార్లు అభాసుపాలైంది. అయితే ఈ అధికార దుర్వినియోగానికి కూడా సుప్రీంకోర్టు అడ్డకట్ట వేసింది. ఒక ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నదో లేదో చట్టసభలోనే తేలాలని బొమ్మై కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించింది. రాష్ట్రపతి పాలన విధించడం న్యాయసమీక్షకు అతీతం కాదని కూడా అదే తీర్పులో స్పష్టం చేసింది. ఆర్టికల్ 356 దుర్వినియోగం సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని గర్హించింది.


గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా సుదీర్ఘ జాప్యం చేయకూడదంటూనే గత ఏడాది నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ బిల్లుల ఆమోదానికి తాము నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించలేమని, తమ న్యాయ సమీక్ష పరిమితంగానే ఉంటుందని చెప్పి పదవీకాలాన్ని ముగించుకున్నారు. విచిత్రమేమిటంటే గవర్నర్లకు బిల్లులను ఆమోదించే విషయంలో విచక్షణాధికారం పూర్తిగా ఉండాలని కనీసం పది రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే గవర్నర్ల విచక్షణాధికారాన్ని వ్యతిరేకించాయి! గవర్నర్లకు సమయం నిర్దేశించలేమన్న సుప్రీంకోర్టే స్పీకర్లు మాత్రం నిర్దిష్టకాలంలో సభ్యుల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని హుకుం జారీ చేసింది!


కొన్ని కీలక సందర్భాల్లో రాష్ట్రపతి, గవర్నర్ల రాజ్యాంగ పాత్రకు విశేష ప్రాధాన్యం లభిస్తుంది. ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితుల్లో రాష్ట్రపతి, గవర్నర్‌ల నిర్ణయాధికారానికి ప్రాముఖ్యత ఉంటుంది. దీనికి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలు విధించినందువల్ల ఈ విషయంలోనూ వారికి పెద్దగా స్వేచ్చ ఉండే అవకాశం లేదు. తొందరపడి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేసినప్పుడు గవర్నర్ కలుగచేసుకునే అవకాశాలున్నాయి. అప్పుడు గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి. రాజ్యాంగ పరిమితిలోనే రాష్ట్రాల చట్టాలు ఉండేలా చూసేందుకు గవర్నర్లకు కల్పించిన విచక్షణాధికారం ఇది. చాలా అరుదైన సందర్భాల్లోనే అలా జరుగుతుంది. రాష్ట్రపతికి కూడా ఇలాంటి అధికారం ఉంటుంది. 1986లో రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన పోస్టల్ బిల్లు వ్యక్తిగత గోప్యతకు వ్యతిరేకంగా ఉన్నదంటూ రాష్ట్రపతి జైల్‌సింగ్ ఆ బిల్లును ఆమోదించకుండా తొక్కిపెట్టారు. చివరకు ప్రభుత్వమే ఆ బిల్లును ఉపసంహరించుకుంది. అంటే గవర్నర్, రాష్ట్రపతి పదవులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా కాపాడుతూ, సరిదిద్ది, సమన్వయం చేసేందుకు (చెక్స్ అండ్ బ్యాలన్స్) ఉపయోగపడతాయి. అయితే గవర్నర్లు అలా రాజ్యాంగ నిష్ఠతో వ్యవహరిస్తున్నారా? నిజానికి ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసేటప్పుడు రాష్ట్రాలను విధిగా సంప్రదించాలని సర్కారియా కమిషన్‌కు బీజేపీ విన్నవించింది. మరి ఇప్పుడు అలా సంప్రదిస్తున్నారా?


నిజానికి భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రకారం షెడ్యూల్డు ప్రాంతాల్లో ఆదివాసీల ప్రయోజనాలు కాపాడేందుకు సంరక్షకుడుగా గవర్నర్‌ వ్యవహరించాల్సి ఉన్నది. భూ బదిలీలను, వడ్డీ వ్యాపారాలను నియంత్రించే అధికారం గవర్నర్లకు ఉన్నది. కేంద్ర, రాష్ట్ర చట్టాలను సవరించడం, లేదా మినహాయింపు ఇవ్వడం కూడా వారు చేయవచ్చు. ఆదివాసీల ప్రాంతాల్లో పరిస్థితుల గురించి రాష్ట్రపతికి గవర్నర్లు వార్షిక నివేదికలు సమర్పించాలి. ఆదివాసీల సలహా మండలిని ఏర్పాటు చేసి సంక్షేమ చర్యలకు సంబంధించి సూచనలు స్వీకరించాలి. పెసా చట్టాన్ని అమలు చేసేలా చూడాలి. రాజ్యాంగంలోని అధికరణ 244 క్రింద ఆదివాసీ ప్రాంతాల నిర్వహణపై గవర్నర్లకు ప్రత్యేక బాధ్యత ఉంటుంది. కాని ఎంతమంది గవర్నర్లు ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు? ఆదివాసీ ప్రాంతాల్లో భూముల అమ్మకాన్ని, అక్రమ మైనింగ్‌ను నివారించగలుగుతున్నారా? స్వయం పాలన, సహజ వనరుల యాజమాన్యం. భూ హక్కులపై గ్రామసభలకు సాధికారిత కల్పించిన పెసా చట్టం అమలు అయ్యేలా చూడగలుగుతున్నారు? ఆదివాసీలు ఏళ్ల తరబడి జైళ్ల పాలు కాకుండా నిరోధించగలుగుతున్నారా? రాజ్యాంగాన్ని సమీక్షించడం మాట అటుంచి రాజ్యాంగాన్ని సరిగా అమలు చేస్తున్నామా అని 77వ గణతంత్ర దినోత్సవం పూర్తయిన సందర్భంగా ప్రశ్నించుకోవడం మంచిది.

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jan 28 , 2026 | 07:16 PM