వైఎస్సార్ నుంచి అజిత్ పవార్ వరకూ..!
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:36 AM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది.
గగనతలంలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో ప్రముఖులు
న్యూఢిల్లీ, జనవరి 28: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. భారత్‌లో ఇప్పటి వరకూ జరిగిన విమాన ప్రమాదాల్లో ఎందరో ప్రజా నేతలు ప్రాణాలు కోల్పోయారు. తాజా దుర్ఘటన రాజకీయ ప్రముఖుల గగనతల ప్రయాణాల్లో భద్రతా వైఫల్యాలను మరోసారి ఎత్తిచూపింది. గత కొన్ని దశాబ్దాల్లో విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖ రాజకీయ నేతల వివరాలు ఇవీ...
దోర్జీ ఖండు (2011)
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దోర్జీ ఖండు 2011 ఏప్రిల్ 30న తవాంగ్ జిల్లా సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హిమాలయ ప్రాంతంలో వాతావరణంలో అనిశ్చితి కారణంగా టేకాఫ్ తీసుకున్న కాసేపటికే హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. రోజుల తరబడి గాలింపు చర్యలు చేపట్టిన వైమానిక దళం, సైన్యం.. దట్టమైన అటవీ ప్రాంతంలో శిథిలాలను గుర్తించాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి (2009)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. రాజకీయ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్.. ప్రతికూల వాతావరణం కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది.
ఓంప్రకాశ్ జిందాల్, సురేంద్ర సింగ్ (2005)
జిందాల్ గ్రూపు వ్యవస్థాపకుడు, హరియాణా మంత్రి ఓంప్రకాశ్ జిందాల్, వ్యవసాయ మంత్రి సురేంద్ర సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ సమీపంలో 2005 మార్చి 3న జరిగిన కింగ్ కోబ్రా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
జీఎంసీ బాలయోగి (2002)
అప్పటి లోక్‌సభ స్పీకర్, టీడీపీ నాయకుడు బాలయోగి 2002 మార్చి 3న జరిగిన బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వాతావరణం అనుకూలించక ఆ హెలికాప్టర్ కృష్ణా జిల్లాలో కూలిపోయింది.
మాధవరావు సింధియా (2001)
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాధవరావు సింధియా 2001 సెప్టెంబరు 30న ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి సమీపంలో జరిగిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 విమాన ప్రమాదంలో చనిపోయారు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న విమానం వాతావరణం ప్రతికూలంగా మారడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది.