దేశమే గొప్ప.. ఎంపీలంతా ఏకమవ్వాలి
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:03 AM
వికసిత్ భారత్ లక్ష్యంగా పార్లమెంటు సభ్యులందరూ ఏకతాటిపై నిలిచి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా కలిసి పనిచేయాలి : రాష్ట్రపతి
పార్లమెంటులో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన ముర్ము
న్యూఢిల్లీ, జనవరి 28: వికసిత్ భారత్ లక్ష్యంగా పార్లమెంటు సభ్యులందరూ ఏకతాటిపై నిలిచి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విభేదాలకు అతీతంగా స్వదేశీ వస్తువుల వినియోగం, దేశ భద్రత వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని కోరారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం ఆమె ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. విభిన్న అభిప్రాయాలు, వేర్వేరు దృక్కోణాలు ఉన్నప్పటికీ దేశం విషయంలో మాత్రం అంతా ఏకమవ్వాలని.. దేశం కంటే గొప్పదేమీ లేదని ముర్ము చెప్పారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని.. కొన్ని అంశాల్లో మాత్రం వాటికి తావుండకూడదని, ఇదే విషయాన్ని మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్, వల్లభాయ్ పటేల్, జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయీలూ విశ్వసించారని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎంపీలందరూ ఐక్యంగా నిలబడాలన్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభల్లో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఆమె ప్రసంగం నిస్సారంగా ఉందని ఆరోపించింది.