Share News

పంజాబ్‌లో బీజేపీకి షాక్.. మళ్లీ ఉద్యమ బాటపట్టిన రైతులు

ABN , Publish Date - Jul 27 , 2026 | 08:38 PM

పంజాబ్‌‌లో అన్నదాతలు మరోసారి ఆందోళన బాటపట్టారు. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు మరోసారి శంభు సరిహద్దు వద్ద గుమిగూడారు.

పంజాబ్‌లో బీజేపీకి షాక్.. మళ్లీ ఉద్యమ బాటపట్టిన రైతులు

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల ప్రధాన నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర పర్యటనతో అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అంశాలను తెరపైకి తీసుకువచ్చి, నూతన రాజకీయ ఒరవడిని సృష్టించాలని భావించిన బీజేపీకి.. ప్రస్తుతం ఇలా రైతులు ఆందోళనకు దిగడం సవాల్‌గా మారింది.


భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు మరోసారి శంభు సరిహద్దు వద్ద గుమిగూడారు. వారిని ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు 2020-21 వ్యవసాయ చట్టాల ఉద్యమం, 2024 అన్నదాతల ఆందోళనలను గుర్తుచేస్తున్నాయి. ఇరుదేశాల మధ్య ఈ ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే.. అమెరికా నుంచి భారీ సబ్సిడీలతో వచ్చే వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశముందని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఫలితంగా.. దేశంలో రైతు ఉత్పత్తులకు ధరలు తగ్గి ఆదాయం దెబ్బతింటుందని వారు వాపోతున్నారు.


మరోవైపు.. ఒప్పందం పూర్తయ్యే వరకు వేచి చూడాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఆ తర్వాత రైతుల ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం ఉండదని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. ఈ అంశంపై పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని, రైతులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. అన్నదాతలు, పశుపోషకుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారన్నారు. అయితే.. ఈ ప్రతిపాదిత ఒప్పందాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ డీల్ ద్వారా వ్యవసాయం, పాల పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ డీల్‌ను రైతులపై 'అతిపెద్ద ద్రోహం'గా అభివర్ణిస్తూ.. ముసాయిదా ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తోంది. అటు.. శిరోమణి అకాలీదళ్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపింది.


పంజాబ్‌లో రైతులు మరోసారి ఇలా ఉద్యమ బాటపట్టడంతో ఎన్నికల వేళ అన్నదాతల సమస్యలే ప్రధాన చర్చాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. 2020లోనూ ఇదే తరహాలో సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన రైతులు.. మరలా ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందానికి ప్రతికూలంగా ఆందోళనలకు దిగడం విశేషం. ఇదిలాగే తీవ్రరూపం దాల్చితే విదేశీ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశంలో జరిగే తొలి భారీ రైతు ఉద్యమం కానుంది.


ఇవీ చదవండి:

పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..

విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

Updated Date - Jul 27 , 2026 | 09:44 PM