పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ దుర్మరణం
ABN , Publish Date - Feb 06 , 2026 | 09:47 AM
పంజాబ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లో పట్టపగలే కాల్పులు కలకలం రేపాయి. జలంధర్‌లోని అత్యంత రద్దీగా ఉండే మోడల్ టౌన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు లక్కీ ఒబెరాయ్ లక్ష్యంగా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఒబెరాయ్.. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. జలంధర్‌లోని గురుద్వారా సాహిబ్ వద్ద ఒబెరాయ్.. తన కారును పార్క్ చేస్తుండగా ఒక్కసారిగా తూటాలు పేలాయి. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కారులో ఉండగానే ఒబెరాయ్‌కు సుమారు 5 బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆయన్ను.. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలోకి తరలించారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమించి మృతిచెందారు. ఈ ఘటనపై పోలీస్ అధికారులు వేగంగా స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ బృందం అక్కడికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఒబెరాయ్ రోజూ ఉదయం గురుద్వారాను సందర్శిస్తుంటారని తెలుస్తోంది. ఆయన దినచర్యను గమనించే.. దుండగులు పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
కాగా.. లక్కీ ఒబెరాయ్ సతీమణి సిమర్‌జోత్ కౌర్.. గతంలో ఆప్ అభ్యర్థిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. ఈ హత్యకు రాజకీయాలే కారణమా? లేక పాత కక్షలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
వేలానికి దివంగత సీఎం జయలలిత ఇల్లు!
మీరెన్ని నినాదాలు చేసినా.. నాకుసమాధి తవ్వలేరు
Read Latest AP & TG And National & International News