Share News

అమెరికా సుంకాల తగ్గింపు.. వారంలో అమల్లోకి!

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:48 AM

భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలిదశ సిద్ధమైందని.. దీనిపై నాలుగైదు రోజుల్లో సంతకాలు జరిగి, సంయుక్త ప్రకటన వెలువడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు.

అమెరికా సుంకాల తగ్గింపు.. వారంలో అమల్లోకి!

  • అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపైనాలుగైదు రోజుల్లో సంయుక్త ప్రకటన

  • మార్చి మధ్య నాటికి చట్టబద్ధ ఒప్పందం

  • వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలిదశ సిద్ధమైందని.. దీనిపై నాలుగైదు రోజుల్లో సంతకాలు జరిగి, సంయుక్త ప్రకటన వెలువడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. తర్వాతి ఒకటి రెండు రోజుల్లోనే (సుమారు వారం రోజుల్లో) భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. చట్టబద్ధ ఒప్పందాన్ని సిద్ధం చేయడానికి నెలా, నెలన్నర రోజులు పట్టవచ్చని.. మార్చి మధ్య నాటికి దానిపై సంతకాలు పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత అమెరికా ఉత్పత్తులపై భారత్‌లో సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. చట్టబద్ధ ఒప్పందం తర్వాత భారత్‌కు మరిన్ని మినహాయింపులు దక్కుతాయని, అందువల్ల ఒప్పందం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల (500 బిలియన్‌ డాలర్ల) దిగుమతులకు అంగీకరించిన అంశంపై పీయూష్‌ గోయల్‌ స్పందిస్తూ.. ‘‘వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌కు భారీగా చమురు, డేటా సెంటర్లు, సమాచార రంగ పరికరాలు అవసరం. దానికి అదనంగా మన దేశానికి అవసరమైన విమానాల కోసం ఇప్పటికే చేసిన, ఇకపై చేయబోయే ఆర్డర్ల విలువే రూ.7.2 లక్షల కోట్ల (80 బిలియన్‌ డాలర్లు)కుపైగా ఉంటుంది. ఇక పాతవాటికి అవసరమైన ఇంజన్లు, విడిభాగాల ఖర్చును కలిపితే ఇది రూ.9లక్షల కోట్లు (100 బిలియన్లు) దాటుతుంది. భారత్‌ డేటా సెంటర్ల ఏర్పాటుకు ట్యాక్స్‌ హాలిడే ఇచ్చింది. దీనితో రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.13.5 లక్షల కోట్ల మేర డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు వస్తే.. వాటికి సంబంధించిన పరికరాలను అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటాం. ఇలాంటివన్నీ లెక్కిస్తే రూ.45 లక్షల కోట్ల దిగుమతులు పెద్ద విషయమేమీ కాదు..’’ అని పేర్కొన్నారు. అమెరికాలో భారత్‌ పెట్టుబడులు పెట్టాలన్న అంశమేదీ వాణిజ్య ఒప్పందంలో లేదని స్పష్టం చేశారు. ఇక వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. అమెరికాలో కేవలం ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేస్తే చాలు సుంకాల్లో మార్పులు అమల్లోకి వస్తాయని.. కానీ భారత్‌ చట్టాల ప్రకారం సన్నిహిత మిత్రదేశం (మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌) హోదా కల్పించి, పూర్తిస్థాయి చట్టబద్ధ ఒప్పందంపై సంతకాలు జరిగితేనే సుంకా ల్లో మార్పు చేయవచ్చని తెలిపారు. ఈ కారణంగానే అమెరికా సుంకాల తగ్గింపు త్వరగా అమలవుతుందని.. భారత సుంకాల తగ్గింపు కోసం సమయం పడుతుందని, దీనిని ఒప్పందంలో చేర్చామని ఆయన వివరించారు.


ఇంధన భద్రతకు అనుగుణంగానే నిర్ణయం: విదేశాంగ శాఖ

దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని.. అందు కు అనుగుణంగానే చమురు కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ పూర్తిగా నిలిపివేస్తుందని, వెనెజువెలా చమురు కొంటుందని అమెరికా చేసిన ప్రకటనను మీడియా ప్రస్తావించగా.. దేశ ప్రజల ఇంధన భద్రతకే ప్రభుత్వ ప్రాధాన్యం ఉంటుందన్నారు. భారత్‌ గతంలో వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసిం దని తెలిపారు. ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి, వెనెజువెలా, ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని జైస్వాల్‌ వెల్లడించారు.

Updated Date - Feb 06 , 2026 | 02:48 AM