Share News

మీరెన్ని నినాదాలు చేసినా.. నాకుసమాధి తవ్వలేరు

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:52 AM

దేశంలోని కోట్లాది మంది ప్రజలు, తల్లులు, అక్కచెల్లెళ్ల రక్షణ నాకుంది. మీరెన్ని నినాదాలు చేసినా.. నాకు సమాధి తవ్వలేరు’’ అని కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు.

మీరెన్ని నినాదాలు చేసినా.. నాకుసమాధి తవ్వలేరు

  • ఆర్టికల్‌ 370 రద్దు, ఈశాన్య భారతాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేయడం, ఆపరేషన్‌ సిందూర్‌, పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు వారి శిబిరాల్లోకే వెళ్లి బుద్ధి చెప్పడం, నక్సలైట్లను నిర్మూలించడం, సింధూనది జలాల ఒప్పందాన్ని బుట్టదాఖలు చేయడం వంటి పనులు చేసినందుకే నా కోసం ప్రతిపక్షాలు సమాధిని తవ్వాలనుకుంటున్నాయి.

- ప్రధాని నరేంద్ర మోదీ

  • గిరిజన మహిళ రాష్ట్రపతిని, దళిత బిడ్డ తెన్నేటినీ అవమానించారు

  • ప్రధాని పదవి మీ కుటుంబ జాగీరు కాదు

  • మీరు జనాభాను సమస్య అనుకుంటే.. మేం పరిష్కారం అని భావిస్తున్నాం.. రాజ్యసభలో మోదీ ఫైర్‌.. విపక్షాల వాకౌట్‌

  • లోక్‌సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం.. విపక్షాల తీవ్ర నిరసన

  • మోదీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతోనే ప్రధానిని సభకు రావొద్దన్నా: స్పీకర్‌ ఓం బిర్లా

  • మా మహిళా ఎంపీలు ఏమైనా ఉగ్రవాదులా?: ప్రియాంక

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలోని కోట్లాది మంది ప్రజలు, తల్లులు, అక్కచెల్లెళ్ల రక్షణ నాకుంది. మీరెన్ని నినాదాలు చేసినా.. నాకు సమాధి తవ్వలేరు’’ అని కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని.. ప్రేమ దుకాణం గురించి మాట్లాడేవాళ్లు.. ‘మోదీ నీ సమాధి తవ్వుతాం’ అనే నినాదాలు ఎలా చేస్తారని దుయ్యబట్టారు. లోక్‌సభలో నాలుగు రోజులపాటు ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు హాజరు కాని ప్రధాని.. గురువారం రాజ్యసభకు హాజరై ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్షాలు పెద్దపెట్టున నినాదాలు చేసినప్పటికీ మోదీ పట్టించుకోలేదు. ‘మీ వయసు రీత్యా మీరు కూర్చుని నినాదాలు చేయండి.. లేదంటే అలసిపోతారు’ అని ఖర్గేపై సెటైర్లు వేశారు. ఈ దశలో విపక్షాలు మోదీ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్‌ చేయటంతో.. ‘అలసిపోయి, వారే వెళ్లిపోయారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. తనను అయిదారు సార్లు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారని, కానీ తాను ప్రారంభిస్తే ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.


ఆర్టికల్‌ 370 రద్దు, ఈశాన్య భారతాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేయడం, ఆపరేషన్‌ సిందూర్‌, పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు వారి శిబిరాల్లోకే వెళ్లి బుద్ధి చెప్పడం, నక్సలైట్లను నిర్మూలించడం, సింధూనది జలాల ఒప్పందాన్ని బుట్టదాఖలు చేయడం వంటి పనులు చేసినందుకే తనకోసం ప్రతిపక్షాలు సమాధిని తవ్వాలనుకుంటున్నాయని ప్రధానమంత్రి మోదీ అరోపించారు. ‘మొహబ్బత్‌ కీ దుకాణ్‌ అని చెప్పేవారు గత 25 సంవత్సరాలుగా నన్ను అవమానిస్తూనే ఉన్నారు. నన్నే కాదు, గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై చర్చను అడ్డుకుని ఆమెను కూడా అవమానించారు. లోక్‌సభలో ప్యానల్‌ చైర్మన్‌గా ఉన్న దళిత బిడ్డ, తెలుగుదేశం ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌నూ అవమానించారు. దేశం కోసం త్యాగం చేసిన సిక్కు మంత్రి బిట్టూను ద్రోహి అంటూ అవమానించారు. అస్సాం ప్రజాగాయకుడు భూపేన్‌ హజారికాకు భారతరత్న పురస్కారం ప్రకటిస్తే.. ఆయనను కూడా అవమానించారు. అలాంటి వారికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇతరులను అవమానించడం కాంగ్రెస్‌ సంస్కృతిలో భాగం’ అని ప్రధాని మండిపడ్డారు.

ప్రపంచ సవాళ్లకు భారత్‌ వద్ద సమాధానం

21వ శతాబ్దం రెండో భాగంలో ఉన్న దేశానికి ఎం తో భవిష్యత్‌ ఉందని, అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. మన లక్ష్యం సాధించేవరకు వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పారు. దేశానికి ప్రతిభ గల యువతే వరమ ని, ప్రపంచంలోని అనేక సవాళ్లకు భారత్‌ జవాబివ్వగలదని తెలిపారు. అత్యధిక అభివృద్ధి రేటు, తక్కువ ద్రవ్యోల్బణం మన ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాజెక్టులను ప్రకటించడం తప్ప పూర్తి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. తాను ప్రధాని అయిన తర్వాతే సర్దార్‌ సరోవర్‌ ఆనకట్టను ప్రారంభించినట్లు తెలిపారు. రైల్వే ప్రాజెక్టులైనా, రహదారులైనా పూర్తి చేసేంతవరకు తాము విశ్రమించడం లేదని చెప్పారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ తనకు 35 (జనాభాను ఉద్దేశించి) కోట్ల సమస్యలున్నాయంటే, ఇందిగాంధీ57 కోట్ల సమస్యలున్నాయని చెప్పుకున్నారని.. తాము మాత్రం 140 కోట్ల మంది ప్రజలకు 140 కోట్ల పరిష్కారాలున్నాయంటున్నామని ప్రధాని పేర్కొన్నారు. గరీబీ హటావో అనేది కాంగ్రెస్‌ హయాంలో నినాదానికే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇతర దేశాలు వెనుకాడేవని, తాము యూరోపియన్‌ యూనియన్‌తో ఒప్పందాలకే తల్లిలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో అక్రమ చొరబాటుదారుల వల్ల దుర్భర పరిస్థితి నెలకొందని ప్రధాని అన్నారు.


ప్రధాని సమాధానం లేకుండానే బిల్లుకు ఆమోదం

చైనాతో ఘర్షణ సమయంలో ప్రభుత్వం తమకు సరైన దిశానిర్దేశం చేయలేదని ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ నరవణె తన పుస్తకంలో రాసిన అంశాలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రస్తావించకుండా అధికార పక్షం అడ్డుకోవటంతో నాలుగైదు రోజులుగా తీవ్ర ప్రతిష్టంభ న ఏర్పడిన విషయం తెలిసిందే. గురువారం సభలో మరింత నాటకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం సాయంత్రం లోక్‌సభలో కొందరు ప్రతిపక్ష మహిళా సభ్యులు ప్రధాని కుర్చీ వద్దకు రావడంతో ఆయన భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని సమాచారం అందిందని, అందుకే ప్రధానిని సభకు రావద్దని తానే సూచించినట్లు స్పీకర్‌ ఓం బిర్లా గురువారం లోక్‌సభలో ప్రకటించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రధాని సమాధానం లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదింపజేశారు. ఈ పరిణామంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

నిజాలకు భయపడి.. అబద్ధాలను ఆశ్రయించిన ప్రధాని: రాహుల్‌ గాంధీ

ప్రధాని ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, పవన్‌ఖేరా తిప్పికొట్టారు. నిజాలను చూసి ప్రధాని భయపడుతున్నారని, అందుకే అబద్ధాలను ఆశ్రయించారని ఎక్స్‌లో రాహుల్‌ గురువారం విమర్శించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అడిగిన కొన్ని ప్రశ్నలకే ప్రభుత్వం బెంబేలెత్తిపోయిందని ఎద్దేవా చేశారు. లోక్‌సభకు హాజరు కాకుండా చర్చ నుంచి తప్పించుకునేందుకే తమపై ప్రధాని తప్పుడు ఆరోపణలు చేశారని ఎంపీ ప్రియాంకాగాంధీ విమర్శించారు. ప్రధాని సీటు వద్ద బుధవారం ముగ్గురు మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారని, వారివల్ల మోదీ భద్రతకు ఎలా ముప్పు వస్తుందని ప్రశ్నించారు. మహిళలు మోదీపై దాడి చేయబోతున్నారనే తప్పుడు కథనాలను మీడియాలో వ్యాప్తి చేయించారని పవన్‌ ఖేరా ఆరోపించారు.

Updated Date - Feb 06 , 2026 | 02:53 AM