లంకేశ్, దభోల్కర్ హత్యల వెనుక సంఘ్.. ప్రియాంక్ ఆరోపణ.. ఆధారాలు చూపాలన్న సూర్య
ABN , Publish Date - Nov 10 , 2026 | 08:44 PM
జర్నలిస్టు గౌరీ లంకేశ్, స్కాలర్ ఎంఎం కల్బుర్గి, హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్యల వెనుక సంఘ్ పరివార్ హస్తం ఉందని కర్నాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన ఆరోపణలకు మూడు రోజుల్లో ఆధారాలు చూపాలని లేకపోతే ఆయన రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డిమాండ్ చేశారు. సూర్య చేసిన డిమాండ్‌కు ఎక్స్‌లో ఖర్గే స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: జర్నలిస్టు గౌరీ లంకేశ్, స్కాలర్ ఎంఎం కల్బుర్గి, హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్యల వెనుక సంఘ్ పరివార్ హస్తం ఉందని కర్నాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన ఆరోపణలకు మూడు రోజుల్లో ఆధారాలు చూపాలని లేకపోతే ఆయన రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డిమాండ్ చేశారు. సూర్య చేసిన డిమాండ్‌కు ఎక్స్‌లో ఖర్గే స్పందించారు. ఆ హత్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), సీబీఐ జరిపిన విచారణలో నిందితులకు ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలున్న రహస్య నెట్‌వర్క్‌లతో లింకులు ఉన్నట్లు వెల్లడైందని ఖర్గే ఆరోపించారు. గోవింద్ పన్సారే హత్య కేసులోనూ ఇలాంటి సంబంధాలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్‌కు రిజిస్ట్రేషన్ లేదని, సభ్యత్వ వివరాలు, ఆర్థిక లెక్కలు కూడా లేవని ఖర్గే అన్నారు. సంస్థను రిజిస్టర్ చేయించే ధైర్యం ఉందా అని తేజస్వి సూర్యకు ఆయన సవాల్ విసిరారు. రిజిస్ట్రేషన్ ఫీజు తానే చెల్లిస్తానని ఎద్దేవా చేశారు.
అంతకుముందు కేరళలోని కొచ్చిలో ముస్లిం యూత్ లీగ్ రాష్ట్ర సదస్సులో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. కల్బుర్గి, గౌరీ లంకేశ్, దభోల్కర్ హత్యల వెనుక సంఘ్ పరివార్ వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. ఆ కేసులు విచారణలో ఉన్నాయని, మరో ఆరు నెలల్లో దర్యాప్తు ప్రక్రియను పూర్తి చేసి, ఆ హత్యల్లో ప్రమేయమున్న వారందరినీ జైలుకు పంపిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ హత్య వెనుక కూడా అవే శక్తులున్నాయని ఆరోపించారు.
ఖర్గే వ్యాఖ్యలపై తేజస్వి ఎక్స్‌లో స్పందించారు. గౌరీ లంకేశ్, ప్రొఫెసర్ కల్బుర్గి హత్య కేసుల్లో బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, కేరళలో రాజకీయ వేదికలపై ఆరోపణలు చేయడం ఏమిటని సూర్య ప్రశ్నించారు. కర్ణాటక హోం మంత్రిగా కేసుల విచారణను వేగవంతం చేసి చట్టప్రకారం న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఖర్గేపై ఉందన్నారు. న్యాయస్థానాల తీర్పులకు ముందే రాజకీయ వేదికలపై తీర్పులు ప్రకటించడం సరికాదని విమర్శించారు. గౌరీ లంకేశ్ హత్య కేసులో 2018లోనే చార్జిషీటు దాఖలైందని, 2022లో విచారణ ప్రారంభమైందని సూర్య గుర్తుచేశారు. ఇప్పటివరకు ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులు విచారించారని, నిందితులందరూ బెయిల్‌పై బయట ఉన్నారని పేర్కొన్నారు. కల్బుర్గి హత్య కేసులో 2026 సెప్టెంబరు నాటికి 139 మంది సాక్షుల్లో 33 మంది వాంగ్మూలాలే నమోదు చేశారని తెలిపారు. ఈ జాప్యానికి కారణాలేంటో హోం మంత్రి వెల్లడించాలని సూర్య డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
మమతకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. 2013 ఘటనపై వాంగ్మూలం కోరిన పోలీసులు
హెగ్సెత్‌కు ట్రంప్ మద్దతు.. అభిశంసన ప్రయత్నాల వేళ కీలక వ్యాఖ్యలు